భువనగిరిలో ఈ నెల 12 నుంచి అంతర్‌ జిల్లా హాకీ టోర్నీ

ABN , First Publish Date - 2021-11-10T05:28:00+05:30 IST

రాష్ట్రస్థాయి ఐదో జూనియర్‌ బాలుర అంతర్‌ జిల్లాల హాకీ టోర్నమెంట్‌-2021 నిర్వహణకు భువనగిరిలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి

భువనగిరిలో ఈ నెల 12 నుంచి అంతర్‌ జిల్లా హాకీ టోర్నీ
మైదానాన్ని చదును చేస్తున్న సిబ్బంది

 మూడురోజులపాటు కొనసాగనున్న పోటీలు 

భువనగిరి టౌన్‌, నవంబరు 9: రాష్ట్రస్థాయి ఐదో జూనియర్‌ బాలుర అంతర్‌ జిల్లాల హాకీ టోర్నమెంట్‌-2021 నిర్వహణకు భువనగిరిలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హాకీ జిల్లా సమాఖ్య ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నీని స్థానిక నల్లగొండరోడ్డులోని న్యూడైమెన్షన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆవరణలో ఈ నెల 12, 13, 14, తేదీల్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లతో కలిసి సుమారు 250మంది రానున్నారు. తమిళనాడు కోమల్‌పట్టిలో డిసెంబరు 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్‌ బాలుర ఛాంపియన్‌షిప్‌-2021లో పాల్గొనే తెలంగాణ జట్టును కూడా ఈ టోర్నీలో ఎంపికచేయనున్నారు. తెలంగాణ హాకీ సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు సరల్‌ తల్వార్‌, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ ముఖే్‌షకుమార్‌, కరెంటోతు లచ్చు టోర్నీని పర్యవేక్షించనున్నారు. టోర్నీలో 28 మ్యాచ్‌ల నిర్వహణకు 11వ తేదీ సాయంత్రం డ్రా తీయనున్నారు. ఈమేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 20 మంది పీఈటీలను టోర్నీ నిర్వహణకు డీఈవో కె.నర్సయ్య ఆన్‌డ్యూటీపై కేటాయించారు.  


టోర్నీ విజయవంతానికి సహకరించాలి : బి.కిరణ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు.  

భువనగిరిలో మొట్టమొదటగా నిర్వహిస్తున్న టోర్నీ విజయవంతానికి  క్రీడాభిమానులందరూ సహకరించాలి. జిల్లాలో హాకీని ప్రోత్సహించే లక్ష్యంతోనే టోర్నీని నిర్వహిస్తున్నాము. మూడురోజులపాటు సాగే టోర్నీని అభిమానులు తిలకించాలి. అంతర్‌జిల్లా క్రీడాకారులను ఆదరించాలి.  

Updated Date - 2021-11-10T05:28:00+05:30 IST