బలిగొన్న ఆర్థిక ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-12-08T06:16:27+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు ఇద్దరిని ఆత్మహత్యకు పురికొల్పాయి. అందులో ఒకరు ప్రభుత్వ టీచర్‌ కాగా, మరో వ్యక్తి హమాలీ. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు వారిని మనస్తాపానికి గురిచేశాయి.

బలిగొన్న ఆర్థిక ఇబ్బందులు
బింగి రాజేందర్‌

జిల్లా కేంద్రంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు ఇద్దరిని ఆత్మహత్యకు పురికొల్పాయి. అందులో ఒకరు ప్రభుత్వ టీచర్‌ కాగా, మరో వ్యక్తి హమాలీ. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు వారిని మనస్తాపానికి గురిచేశాయి. 

మద్యానికి బానిసై...

సూర్యాపేటక్రైం, డిసెంబరు 7 : జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్‌కు చెందిన మరిపెల్లి అర్వపల్లి(42) స్థానిక శివకుమార్‌ రైస్‌మిల్లులో హమాలీగా, అతడి భార్య నిర్మల పలునివాసాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఇటీవల అర్వపల్లి మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో కుటుంబంలో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. రోజూ మాదిరిగానే ఈ నెల 6వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన అర్వపల్లి ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు చూసే సమయానికి అర్వపల్లి మృతి చెంది కనిపించాడు. అర్వపల్లికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైతం..

ఆర్థిక ఇబ్బందులతో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రియాంకకాలనీకి చెందిన బింగి రాజేందర్‌(44) నూతనకల్‌ మండల కేంద్రంలోని ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రాజేందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దకుమార్తె బీటెక్‌ మొదటి సంవత్సరం, రెండో కుమార్తె ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఈ నెల 6వ తేది రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా చోటుచేసుకుంది. దీంతో రాజేందర్‌ భార్య సూర్యాపేటలోనే ఉన్న తల్లిగారింటికి వెళ్లింది. ఆమె వెళ్లిన అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే గొడవ కారణంగా భావిస్తున్నారు. అయితే ప్రతి రోజూ తనతో పాటు పాఠశాలకు వెళ్లే మరో ఉపాధ్యాయుడు రాజేందర్‌ కోసం వేచిచూశాడు. పాఠశాల సమయం దాటి పోతుండటం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో నేరుగా రాజేందర్‌ ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు లోపల గడియ పెట్టి ఉండటం, ఫోన్‌ మోగుతున్నా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా రాజేందర్‌ మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని రాజేందర్‌ కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. రాజేందర్‌ తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-08T06:16:27+05:30 IST