అడ్డు వస్తున్నాడని.. అడ్డు తొలగించాలని

ABN , First Publish Date - 2021-12-09T04:55:35+05:30 IST

సూర్యాపేట జిల్లా అర్వపల్లి జడ్పీటీసీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కే

అడ్డు వస్తున్నాడని.. అడ్డు తొలగించాలని
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, వెనక నిందితులు(ముసుగులోని వారు)

అర్వపల్లి జడ్పీటీసీ హత్యకు కుట్ర 

నలుగురి అరెస్టు

బంధువులే సూత్రధారులు 

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ 

సూర్యాపేటక్రైం, డిసెంబరు 8 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి జడ్పీటీసీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. సూర్యాపేటలోని సీతారాంపురంకాలనీలోని ఓ ఇంట్లో పలువురు గంజాయి పీలుస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడిచేయగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అంతేకాకుండా వారి వద్ద రెండు కిలోల గంజాయి, పలు మారణాయుధాలు ఉన్నాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ హత్యకు కుట్ర పన్నారని గుర్తించారు. అందుకు దారి తీసిన విషయాలను ఆరా తీశారు. జడ్పీటీసీ వీరప్రసాద్‌యాదవ్‌ అర్వపల్లికి చెందిన ముదిరాజ్‌ కులస్తుడు లింగంపల్లి జగన్నాథం రెండో భార్య రెండో కుమార్తె మనీషాను ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. కరోనా రెండోదశ వ్యాప్తి సమయంలో వీరప్రసాద్‌యాదవ్‌ మామ జగన్నాధం మృతి చెందాడు. ఆయన దహన సంస్కారాలు నిర్వహించే విషయంలో తగాదా జరిగింది. జగన్నాథం మొదటి భార్య కుమార్తె కవిత వివాహమై అర్వపల్లిలో నివాసముంటున్నారు. జగన్నాథం అంత్యక్రియలు కవితతో జరిపించాలని కుల పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో వీరప్రపాద్‌యాదవ్‌ అడ్డుచెప్పి జగన్నాథం రెండో భార్య మొదటి కుమార్తె, తన భార్య సోదరి శ్వేతతో అంత్యక్రియలు జరిపించాడు. దీంతో జగన్నాథం సోదరుడి కుమారుడు సుధాకర్‌, బంధువులకు వీరప్రసాద్‌యాదవ్‌కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 

జైలుకు వెళుతూ ఆదేశం...

స్థానికుడు మేకల సంతో్‌షను గాయపర్చిన ఘటనలో లింగంపల్లి జగన్నాథం మొదటి భార్య అల్లుడు జిన్నే శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదుకాగా జైలుకు వెళ్లారు. అయితే వీరప్రసాద్‌యాదవ్‌ కావాలనే కేసు నమోదు చేయించాడని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా వీరప్రసాద్‌యాదవ్‌ను చంపండి ఎంత ఖర్చయినా తానే భరిస్తానని; తాను జైలుకు వెళ్లి వచ్చాక సంబంధిత డబ్బును ఇస్తానని జిన్నే శ్రీను జైలుకు వెళ్లే ముందు అర్వపల్లికి చెందిన అలువాల వెంకటస్వామి, సుధాకర్‌లతో అన్నాడు. దీనికితోడు గ్రామానికి చెందిన లింగంపల్లి సంజయ్‌ అనే పాతనేరస్థుడికి చెందిన మూడు గుంటల భూమి పంచాయితీలోనూ వీరప్రసాద్‌యాదవ్‌ కలుగచేసుకుని భూమిని సంజయ్‌కు దక్కకుండా అడ్డుపడ్డాడు. దీంతో సంజయ్‌ కోపంతో ఉన్నాడు. వీటితో పాటు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాలో చేపట్టిన యాత్ర సందర్భంగా అర్వపల్లిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మూసీ ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ అలువాల వెంకటస్వామి ఇంటిపై వీరప్రసాద్‌యాదవ్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో వీరప్రసాద్‌యాదవ్‌ ప్రతి విషయంలో తమకు అడ్డుతగులుతున్నాడని భావించిన లింగంపల్లి సుధాకర్‌, అలువాల వెంకటస్వామిలు వీరప్రసాద్‌యాదవ్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో డబ్బులు తీసుకుని హత్యలు, ఇతర నేరాలకు పాల్పడే అలవాటు ఉన్న బంధువైన ప్రస్తుతం పూణెలో నివాసముంటున్న సూర్యాపేటకు చెందిన లింగంపల్లి సంజయ్‌, సూర్యాపేటలోని సీతారాంపురం కాలనీకి చెందిన రౌడీషీటర్‌ పోతరాజు సైదులును ఆశ్రయించారు.

రెండు కత్తులు.. వేటకొడవళ్లు

లింగంపల్లి సుధాకర్‌, అలువాల వెంకటస్వామి, పోతరాజు సైదులు, లింగంపల్లి సంజయ్‌లు నవంబరు 22వ తేదీన సూర్యాపేటలోని కాకతీయ బార్‌అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం తాగుతూ వీరప్రసాద్‌యాదవ్‌ హత్యకు పధకం రూపొందించారు. అందుకోసం సూర్యాపేటలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో రెండు కత్తులు, రెండు వేటకొడవళ్లు కొనుగోలు చేశారు. వీరప్రసాద్‌యాదవ్‌ కదలికలను గమనిస్తూ అవకాశం ఉన్న సమయంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం సూర్యాపేటలోని పోతరాజు సైదులు నివాసంలో గంజాయి తాగుతూ వీరప్రసాద్‌యాదవ్‌ కదలికలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి చేశామని ఎస్పీ తెలిపారు. పోలీసుల దాడిలో సుధాకర్‌, వెంకటస్వామి, సైదులు, సంజయ్‌ పట్టుబడగా, హత్యకు ఉసిగొల్పిన జిన్నే శ్రీను ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. 

సంజయ్‌పై ఎన్నో కేసులు

అర్వపల్లి జడ్పీటీసీ వీరప్రసాద్‌యాదవ్‌ హత్యకుట్రలో భాగమైన లింగంపల్లి సంజయ్‌కి గతంలోనే నేరచరిత్ర ఉందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 2013లో ఉప్పల్‌లో హత్య కేసు, చైతన్యపురిలో వ్యభిచార గృహ నిర్వహణ కేసుతో పాటు సూర్యాపేట, కేతేపల్లి పోలీ్‌సస్టేషన్ల పరిధిలో దాడులకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయన్నారు. రెండు అరెస్ట్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం పూణెలో ఉంటూ ఆన్‌లైన్‌లో వ్యభిచార వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. జడ్పీటీసీ హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎస్‌.మోహన్‌కుమార్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ అరకపల్లి ఆంజనేయులు, ఎస్‌ఐ పడిశాల శ్రీనివాస్‌, సిబ్బంది ఎం.అంజయ్య, గొర్ల క్రిష్ణయ్య, గోదేశి కర్ణాకర్‌, జె.సైదులు, శ్రవణ్‌, రాంబాబు, మధు, రాజు ఉన్నారు.

Updated Date - 2021-12-09T04:55:35+05:30 IST