అందరికీ పరీక్షే
ABN , First Publish Date - 2021-12-30T06:27:47+05:30 IST
విద్యారంగం ఈ ఏడాది అందరికీ పరీక్ష పెట్టింది. కరోనా ప్రభావం గత విద్యా సంవత్సరంపై తీవ్రంగానే పడింది. ఆన్‌లైన్ క్లాసులతో మొదలైన విద్యార్థుల భవిష్యత్ ‘పరీక్ష’లు ఏడాది పరీక్షలు రాయకుండానే ముగిసిపోయాయి. పరీక్షలేకుండానే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు హాజరుతోనే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు.

1-9 తరగతులకు పరీక్షలేకుండా ప్రమోట్
కరోనా ప్రభావంతో తగ్గిన ఇంటర్ ఫలితాలు
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థుల పాస్
సెకండియర్‌లో, ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులు
కోదాడ: విద్యారంగం ఈ ఏడాది అందరికీ పరీక్ష పెట్టింది. కరోనా ప్రభావం గత విద్యా సంవత్సరంపై తీవ్రంగానే పడింది. ఆన్‌లైన్ క్లాసులతో మొదలైన విద్యార్థుల భవిష్యత్ ‘పరీక్ష’లు ఏడాది పరీక్షలు రాయకుండానే ముగిసిపోయాయి. పరీక్షలేకుండానే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు హాజరుతోనే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. పరీక్షలు రాయకుండానే ఇంటర్నల్ మార్కు ల ఆధారంగా పదో తరగతి విద్యార్థులను పాస్ చేశారు. ఇక ఇంటర్, డిగ్రీ విద్యార్థుల దుస్థితి వర్ణనాతీతం. ఇంటర్ సెకండియర్‌లో ఫస్ట్ పరీక్ష లు, డిగ్రీలో పాఠాలు వినకుండానే పరీక్షలు రాయా ల్సి వచ్చింది. ఇక జిల్లాలో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని జీవన పోరాట ‘పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మానసిక ఒత్తిడిలో విద్యార్థులు, వారి భవిష్యత్‌పై బెంగతో తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వహణలో యాజమాన్యాలకు అడుగడుగా పరీక్షలే ఎదురయ్యాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,282 ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్నారు. వీరంతా కరోనా ప్రభావంతో పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ అయ్యారు. 2020-21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం అన్‌లైన్ తరగతులకు మొగ్గు చూపగా, జూన్, జూలై, ఆగస్టు వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. సెప్టెంబరులో కరోనా తగ్గటంతో ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా, విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బందులుపడ్డారు.
పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణత
కరోనా నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 24వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పదో తరగతిలో ఉతీర్ణత సాధించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు వేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసింది. ఉతీర్ణత సాధించిన విద్యార్థుల్లో సగం మంది విద్యార్థులకు 10 పాయింట్లు రావటం గమనార్హం. చాలా వరకు విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారే తప్పా విద్యార్థుల్లో విషయపరిజ్ఞానం లేదని విద్యానిపుణులు పేర్కొంటున్నారు.
తగ్గిన ఇంటర్ ఫలితాలు
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుమారు 23వేల మంది విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌లో పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం సెకండ్ ఇయర్‌కు 2021- 22కు ప్రమోట్ చేసింది. దీంతో విద్యార్థులు హమ్మయ్యా అనుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మేలో నిర్వహించాల్సిన మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబరు నెలలో రాయాలని సూచించింది. ఫలితంగా మొదటి సంవత్సరంపై పట్టులేకుండానే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో ఫలితాలు గత ఫలితాలతో పోల్చితే 39శాతానికి తగ్గాయి. చదువులో చురుకైన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. దీంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు నల్లగొండలో రైలు కింది పడి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాధాన్నే మిగిల్చింది. ఆత్మహత్యల నేపథ్యంలో ప్రభుత్వం అందరినీ పాస్‌చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులు క్లాస్‌లు లేకపోవటంతో పోటీ పరీక్షల్లో రాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న 21వేలమంది విద్యార్థుల పరిస్థితి కూడా అంతేనంటున్నారు.
పాఠాలు వినలేదు.. అయినా పరీక్షలు
ఎంజీయూ పరిధిలో సుమారు 30వేల మంది డిగ్రీ విద్యార్థులు ఫస్ట్, సెకండ్, ఽథర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 2వ సెమిస్టర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 4వ, థర్డ్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ తరగతుల్లో పాఠాలు చెప్పకుండానే పరీక్షలు నిర్వహించారు. ఫ స్ట్ ఇయర్‌లో 10,619 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 5,251మంది పాస్ అయినట్లు సమాచారం. అంటే 49.45శాతం మాత్రమే ఉతీర్ణత సాధించారు.
మూసివేసే దిశగా బడ్జెట్ స్కూళ్లు
కరోనా ప్రభావం విద్యార్థులపైనే కాకుండా ప్రైవేటు పాఠశాలలపైనా పడింది. కరోనాతో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేయలేని పరి స్థితి బడ్జెట్ (మధ్య, దిగువ తరగతి) పాఠశాల యజమాన్యాలకు ఏర్పడింది. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని దీనస్థితి. ఫలితంగా విద్యార్థుల కు సరైన విద్య అందలేదని తల్లిదండ్రులు పేర్కొం టున్నారు. అంతేగాక ఒకవేళ ఒమైక్రాన్ ముప్పు వస్తే బడ్జెట్ పాఠశాలలన్నీ మూత పడటమేనని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నేర్పిన పాఠానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు గురుకులాల బాటపట్టినట్లు తెలుస్తోంది. కరోనా కాలం కార్పొరేటు విద్యాసంస్థలకు కలిసి వచ్చిందని విద్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికే కరోనాతో విద్యావ్యవస్థ చిధ్రమైంది. ఓతరం విద్యార్థుల భవిత దెబ్బతిన్నది. ఒమైక్రాన్ ముప్పు తప్పి 2022-23 విద్యాసంవత్సరం గాడిలో పడేనా అని తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు.