కేసుల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం

ABN , First Publish Date - 2021-12-31T06:30:50+05:30 IST

కేసుల విచారణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు.

కేసుల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

 ఈ ఏడాది సైబర్‌క్రైంకు 363 ఫిర్యాదులు 

 రోడ్డు ప్రమాదాల్లో 327 మంది మృత్యువాత 

 వివరాలను వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి 

నల్లగొండ క్రైం, డిసెంబరు 30: కేసుల విచారణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. వార్షిక నేరాలకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆమె గురువారం వెల్లడించారు. ఈ ఏడాది సైబర్‌క్రైంకు 365 ఫిర్యాదులు రాగా, 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు 131 కేసులను పరిష్కరించామన్నారు. జీవితబీమా క్లైం పొందేందుకు హత్యలు చేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే గ్యాంగ్‌ను మార్చి నెలలో అరెస్టు చేసి శిక్ష పడేలా చేశామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించి ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు అన్ని రకాలుగా సహకారం అందించామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించి ఉక్కుపాదం మోపామన్నారు. పలు ప్రాంతాల్లో 1062.415కిలోల గంజాయిని సీజ్‌ చేశామన్నారు. మత్తు టాబ్లెట్లు, విడాయిల్‌ రవాణాపై నిఘా ఉంచి సీజ్‌ చేశామన్నారు. భూ ఆక్రమణలు, అక్రమ వ్యాపారాలు చేసే 18 మందిపై పీడీయాక్టు నమోదు చేయగా, అందులో ఆరుగురు గూండాలు, 8 మంది వైట్‌కాలర్‌ నేరస్థులు, ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల విక్రేతలు, మరో ఇద్దరు భూ ఆక్రమణదారులు ఉన్నారని అన్నారు. 


పెరిగిన శిక్షల శాతం

నేరస్థులు తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడంతో ఈ ఏడాది శిక్షల శాతం పెరిగిందన్నారు. మొత్తం 447 కేసులు కోర్టుల్లో ట్రయల్స్‌లో ఉండగా, 57 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. ఎన్‌ఎల్‌జీ కాప్స్‌ నిర్వహణ ద్వారా ఫేస్‌బుక్‌ ఖాతాలకు సంబంధించి ఆన్‌లైన్‌ మోసాలు ఇతర నేరాలపై 205 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. వీటితో పాటు ఈ ఏడాది మొత్తం 23,385 ఈ-పిటీ కేసులు నమోదు చేయగా 5,800 కేసులను పరిష్కరించామన్నారు. 3,01,845 ఈ-చలాన్లు విధించడంతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 11,041 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ ద్వారా 65,936 కేసులు నమోదు చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగంలో సీసీ కెమెరాల ద్వారా రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించడంతోపాటు మహిళల రక్షణకు ఆధునిక టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో టాస్క్‌ఫోర్సు ద్వారా 75కిలోల కేసులు, మూడు నకిలీ పత్తివిత్తనాల కేసు, మూడు పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కేసులు, ప్రజలను మోసం చేసిన వారిపై మూడు చీటింగ్‌ కేసులను నమోదుచేసి నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించామన్నారు. వీటితో పాటు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 296 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో 327 మంది మృత్యువాత పడ్డారని, 540 మందికి గాయాలయ్యాయన్నారు. అదేవిధంగా నల్లగొండ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది 811 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి 775 మందిని కోర్టులో హాజరుపర్చామన్నారు. 180 మందికి న్యాయస్థానం రూ.11,01,300 జరిమానా విధించిందని వివరించారు. నేరాల నియంత్రణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు గుర్తించినా డయల్‌ 100కు, పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-12-31T06:30:50+05:30 IST