శాస్త్రోక్తంగా స్వాతి నక్షత్ర పూజలు
ABN , First Publish Date - 2021-08-16T06:32:37+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆదివారం విశేష పూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి.
భక్తజన సంద్రంగా యాదాద్రిక్షేత్రం
యాదాద్రి టౌన్, ఆగస్టు 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆదివారం విశేష పూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. వేకువజామున స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. కల్యాణ మండపంలో 108 కలశాలను ఏర్పాటు చేసి హోమ పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రపఠనాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామాలతో తులసీదళాలతో అర్చించారు. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవోత్సవం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం బాలాలయంలో స్వాతి నక్షత్ర పూజల అనంతరం ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. అదేవిఽధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ స్వామి జన్మనక్షత్ర వేడుకలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
కిక్కిరిసిన యాదాద్రి
యాదాద్రి క్షేత్రం ఆదివా రం భక్తజన సంద్రాన్ని తలపించింది. వరుస సెలవులు, పవిత్ర శ్రావణమాసం కావడంతో పలు ప్రాంతాల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ తిరువీధులు, సేవా మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకున్న భక్తులు నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనాలకు 4గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2గంటల సమయం పట్టింది. దర్శనాల ద్వారా స్వామికి రూ.4.35లక్షల ఆదాయం, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.11.39లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా వివిధ విభాగాల ద్వారా రూ.27,75,203 ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా, స్వాతంత్య దినోత్సవం సందర్భంగా కొండపైన దేవస్థాన ప్రధాన కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమంగా విధులు నిర్వహించిన సిబ్బందిని సన్మానించారు. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో దేవస్థానంలో ఉత్తమ సేవలు అందజేసిన సిబ్బందికి ప్రభుత్వ విప్ గొంగి డి సునితామహేందర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పథి పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో ఈఈ వూడెపు రామారావు, పర్యవేక్షకులు డి.సురేందర్‌రెడ్డి, వేద పండితులు కొడకండ్ల వేణుగోపాలాచార్యులతో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నా రు. వీరిని దేవస్థాన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్వేల్ రమేశ్‌బాబు అభినందించారు.
