కంటితుడుపు చర్యగా సర్వేలు

ABN , First Publish Date - 2021-05-20T05:59:10+05:30 IST

ప్రభుత్వం కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు చేపట్టిన ఇం టింటి సర్వే కంటి తుడుపు చర్యగా మారింది.

కంటితుడుపు చర్యగా సర్వేలు
హుజూర్‌నగర్‌లో ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీవో వెంకారెడ్డి

మందుల పంపిణీ నామమాత్రమే

కరోనా టెస్ట్‌లు అంతంతగానే..

రెండో విడత సర్వేలో కరోనా బాధితుల వివరాలు మిస్‌

హుజూర్‌నగర్‌,  మే 19 : ప్రభుత్వం కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు చేపట్టిన ఇం టింటి సర్వే కంటి తుడుపు చర్యగా మారింది. మొదటి విడత సర్వేలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించనా మందుల పంపిణీలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు నాలుగు రోజులుగా కొనసాగుతున్న రెండో విడత సర్వే అదే తీరులో ఉందన్న విమర్శలు ఉన్నాయి. అసలే కరోనా నిర్ధారణ పరీక్షలను అరకొరగా చేస్తున్నారు. దీనికి తోడు టీకా వేయడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక వ్యాక్సిన్‌ వేస్తామని ప్రకటనలు చేస్తున్నారే కానీ, ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ఐదు రోజులకు ఒకసారి చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు మండలానికి 50 చొప్పున మాత్రమే చేస్తున్నారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లోనూ 50కి మించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు.  

సర్వేలతో సరి.. 

ఇంటింటి సర్వేపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొదటి విడత సర్వేలో జిల్లాలో 10,881 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. ఇక అందరికీ మెడిసిన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా సగం మందికి కూడా ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. రెండో విడత నాలుగు రోజులుగా సర్వే చేస్తున్నారు. ఇందులో సుమారు లక్షా 18 వేల 901 ఇళ్లను సర్వే చేశారు. కానీ, బాధితులు ఎంతమంది అన్నది ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకుండా పోయాయి. సర్వే చేస్తున్న వారి వద్ద కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి నమోదు చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేద. దీంతో రెండో విడతలో కరోనా లక్షణాలు కలిగిన వారిని ఎంతమందిని గుర్తించారో ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. కింది స్థాయి అధికారుల అంచనా ప్రకారం సుమారు వేయిమందిని రెండో విడతలో లక్షణాలు కలిగిన వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. 2,724 మంది సిబ్బందితో 679 బృందాలు రెండో విడత సర్వే చేసినా పది శాతం కూడా మందులు పంపిణీ చేయకపోవడం కరోనాపై పోరులో ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మండల స్థాయిలోని అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లతో సర్వేలు చేయించి చేతులు దులుపుకుంటున్నారు. రోజుకు వంద ఇళ్లు తిరిగితే అందులో లక్షణాలు కలిగిన వారిలో 10 శాతం మందికి కూడా మందులు తమ వద్ద లేవని చేతులెత్తేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, జిల్లా మొత్తం కరోనా అదుపులో ఉందని చెప్పడం సరికాదంటున్నారు. 


లక్షణాలున్న వారికి మందుల పంపిణీ 

రెండోవిడత సర్వేలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాం. ఇంకా సర్వే జరుగుతోంది. మొదటి విడతలో అందరికీ మందులు పంపిణీ చేశాం. రెండోవిడతలో కొంతమందికి మందులు పంపిణీ చేయాల్సి ఉంది. మండల స్థాయి అధికారులకు కిట్లు పంపిణీ చేశాం. బాధితులకు వెంటనే మందులు అందేలా చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం.  

కోటా చలం, డీఎంహెచ్‌వో

Updated Date - 2021-05-20T05:59:10+05:30 IST