కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి

ABN , First Publish Date - 2021-02-02T05:23:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయే మిగిలింది. రైల్వే లైన్లు, హైవే రోడ్ల ఆశలు గల్లంతయ్యాయి. మన ఎంపీల డిమాండ్లను కేంద్రం పక్కన పడేసింది.

కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి

ఊసేలేని ఉమ్మడి జిల్లా రైల్వే లైన్లు, రోడ్లు 

సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తావన కరువు

నల్లగొండ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/భువనగిరి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయే మిగిలింది. రైల్వే లైన్లు, హైవే రోడ్ల ఆశలు గల్లంతయ్యాయి. మన ఎంపీల డిమాండ్లను కేంద్రం పక్కన పడేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానంగా సూర్యాపేట-కోదాడ మీదుగా విజయవాడకు బుల్లెట్‌ రైలు, రైల్వే లైను ప్రకటన వస్తుందని ఆశించినా ఆ ప్రస్తావన లేదు. దీనిపై గతంలోనే రైల్వే మంత్రి, బోర్డు చైర్మన్లను కలిసి మన ఎంపీలు లేఖలు ఇచ్చి విజ్జప్తులు చేశారు. అయినా నిరాశే మిగిలింది. విష్ణుపురం-జగ్గయ్యపేట ప్యాసింజర్‌ రైలు, 20ఏళ్ల క్రితం మంజూరు చేసిన నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్‌కు కేటాయింపులు, వరంగల్‌ జిల్లా డోర్నకల్‌-మిర్యాలగూడ (వయా సూర్యాపేట) మార్గానికి 2013-14లోనే ప్రతిపాదించగా ఈ అంశాలే లేవు. మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ, నిధులు కేటాయించాలని గత పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలు కేంద్రాన్ని కోరగా, బడ్జెట్‌లో కనిపించలేదు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ పూర్తిస్థాయి అభివృద్ధి ప్రస్తావన లేదు. ఫ్లోరైడ్‌, కరువు పీడిత ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎ్‌సబీసీ సొరంగం, డిండి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు కనిపించలేదు. 75ఏళ్ల పైబడిన పెన్షనర్లను ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడంతో యాదాద్రి జిల్లాలోని సుమారు 150మందికి లాభం చేకూరనుంది. ఎన్‌ఆర్‌ఐలకు డబుల్‌ ట్యాక్సేషన్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో సుమారు వెయ్యి మంది వరకు ప్రవాసీయుల కుటుంబాలకు ఊరట లభించనుంది. జిల్లాలో ఇప్పటి వరకు 12,735 ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండగా ఈ పథకాన్ని పొడిగించడంతో అర్హులైన అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు రానున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు మెగా చేనేత పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొనగా, జిల్లాలోని చౌటుప్పల్‌, పోచంపల్లి ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు దీనిపై ఆశలుపెట్టుకున్నారు.


కార్పొరేట్‌ శక్తులకు అనుకూల బడ్జెట్‌: జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్‌ లేదు. తెలుగు రాష్ట్రాలకు మరోమారు అన్యాయం జరిగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యారు. అన్ని రకాల వస్తువులపై ప్రతక్ష పన్నులు, సెస్సులు విధించడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పేదలు ఇబ్బందిపడనున్నారు. వ్యవసాయరంగానికి పెట్టుబడులు కేటాయించకపోవడంతో ఈ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడనుంది.


దీర్ఘకాలిక ప్రయోజనాలకు అగ్రభాగం :పీవీ.శ్యాంసుందర్‌రావు, బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు

దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎంతో ఉపయుక్తం ఉంది. వైద్య, మౌలిక రంగాలు, సమ్మిళిత అభివృద్ధి తదితర ఆరు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం బాగుంది. అన్ని రంగాల ప్రజలకు బడ్జెట్‌ ఊరడింపు కలిగించింది. విపక్షాల విమర్శలు అర్థరహితం.


ఆదాయ పన్ను మినహాయింపునకు ధన్యవాదాలు : సముద్రాల మల్లికార్జున్‌, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌, నల్లగొండ

కేంద్ర బడ్జెట్‌లో 75 ఏళ్లకుపైబడిన పెన్షనర్లకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది పెన్షనర్లకు ఊరటకలిగించే అంశం. అందుకు ప్రధాన మంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు.


వేతన జీవులకు ఊరట లేదు : ప్రొఫెసర్‌ అంజిరెడ్డి, ఎంజీయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వేతన జీవులకు మొండిచేయి చూపింది. ఉద్యోగుల ఆదాయ పన్నులో ఎలాంటి మార్చులు లేకపోవడం నిరాశకు గురి చేసింది. బడ్జెట్‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు మరింత సులభతరంగా రుణాలు పొందేందుకు బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రామీణ అవస్థాపన సౌకర్యాల కోసం రూ.42వేల కోట్లు కేటాయించారు. విద్యుత్‌ సరఫరాను ఆధునీకరించేందుకు నిధులు ఇచ్చారు. బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యంగా కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌ కోసం కేటాయింపులు చేయడం శుభపరిణామం.


Updated Date - 2021-02-02T05:23:28+05:30 IST