ఆ.. ఆరుగురు
ABN , First Publish Date - 2021-05-21T06:05:14+05:30 IST
బతికినన్నాళ్లు ఎలా ఉన్నా, చివరికి కాటికి వెళ్లేటప్పుడు పాడె మోసేందుకు నలుగురు ఉంటేనే ఆ వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. లక్షల రూపాయలు ఉన్నా, ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా, ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినా, చివరికి మోసేందుకు నలుగురు లేక, ఏడ్చేందుకు నా అనేవారు లేని, అంత్యక్రియల్లో మేమున్నామంటూ రాని ఆ చివరిమజిలీకి పరిపూర్ణత లభించదు.

పరిమళించిన మానవత్వం
కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న యువత
బతికినన్నాళ్లు ఎలా ఉన్నా, చివరికి కాటికి వెళ్లేటప్పుడు పాడె మోసేందుకు నలుగురు ఉంటేనే ఆ వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. లక్షల రూపాయలు ఉన్నా, ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా, ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినా, చివరికి మోసేందుకు నలుగురు లేక, ఏడ్చేందుకు నా అనేవారు లేని, అంత్యక్రియల్లో మేమున్నామంటూ రాని ఆ చివరిమజిలీకి పరిపూర్ణత లభించదు. ప్రస్తుతం కరోనా అందరినీ దూరం చేసింది. కడుపున పుట్టిన బిడ్డలు, పుట్టి పెరిగిన బంధువులు, కష్టసుఖాలు పంచుకున్న స్నేహితులు ఎవరూ రాని, రాలేని పరిస్థితుల్లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. తనకు సంబంధంలేదని, ఎవరికి పుట్టిన బిడ్డలో అంత్యక్రియలు చేస్తూ అనంతలోకాలకు సాగనంపుతున్నారు. వారే హుజూర్‌నగర్‌కు చెందిన ఆ ఆరుగురు..
హుజూర్‌నగర్, మే 20: కరోనాతో మానవాళి అంతా అతలకుతలమవుతోంది. కోటీశ్వరులు కూడా అనాథల్లా కరోనా బారిన పడి చనిపోతే వారి కుటుంబసభ్యులే దగ్గరకు వెళ్లలేని దీనస్థితి. సభ్యసమాజం తలదించుకునేలా కరోనా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. కరోనాతో చనిపోతే ఆ మృతదేహాలు మాకొద్దంటూ వెళ్లిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ నేటి ఆధునిక సమాజానికి కొంతమంది యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా చనిపోయిన రోగులకు వారి కుటుంబసభ్యులు చెప్పిన విధంగా అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన పలువురు యువకులు మేమున్నామని, మీకేం కాదని భరోసా ఇస్తున్నారు. కరోనాతో మృతిచెందిన వారికి ఉచితంగా అంత్యక్రియలుచేస్తూ మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నారు.
స్నేహితులకు పుట్టిన ఆలోచనే ఇది
హుజూర్‌నగర్‌కు చెందిన కొప్పుల శ్రీకాంత్, తమ్మారపు నాని, భానోతు కార్తీక్, మాదాసు గోపి, షేక్ మౌలానా, ఏసుమళ్ల వెంకటేశ్‌లు కరోనాతో చనిపోయిన వారిని ఆటోల్లో తీసుకెళ్లి అంత్యక్రియలుచేస్తూ మానవత్వపు పరిమళాలు వెదజల్లుతున్నారు. ఈ ఆరుగురు యువకులు 25 ఏళ్లలోపు వారే కావడంతోపాటు అంతా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న యువకులు కావడం గమనార్హం. పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకులందరూ స్నేహితులుగా ఉన్నారు. వారంతా ప్రస్తుత సెకండ్‌వేవ్ నేపథ్యంలో సమాజానికి ఏదో విధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ మహోన్నత ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. 20 రోజుల నుంచి కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారు. హుజూర్‌నగర్, యాతవాకిళ్ల, అమరవరం, దొండపాడు, మేళ్లచెరువు, కోదాడ, వేపలసింగారం, సూర్యాపేట ప్రాంతాల్లో కరోనాతో మృతి చెందిన సుమారు 40మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మృతదేహాలకు ఏ మతం వారైతే, ఆ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, వారి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆదర్శంగా నిలిచారు. కరోనా వచ్చిన వారిని చూస్తేనే భయంతో పారిపోయే పరిస్థితుల్లో మృతుల కుంబాలకు భరోసా కల్పిస్తూ ఎవరికీ వారు ఏమీ కాకపోయినా బంధాలు, బంధుత్వాలు లేకపోయినప్పటికీ కరోనాతో చనిపోయారని ఒక్క ఫోన్ (88853 51516)కు కాల్ చేస్తే చాలు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనాతో ఇబ్బందులు పడే వారిని ఇంటి వద్ద ఉంటే ఆసుపత్రికి, ఆసుపత్రి వద్ద ఉంటే ఇంటికి ఆటోలో చేరవేస్తున్నారు.
కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను : తమ్మారపు నాని, గోవిందాపురం
హుజూర్‌నగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల కరోనా సెకండ్‌వేవ్ వచ్చిన దగ్గర నుంచి స్నేహితులమంతా కలిసి కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నాము. మేము ఆరుగురం స్నేహితులం కావడంతో అంత్యక్రియలు చేసి పేదలకు అండగా ఉండాలని అనుకున్నాం. దీంతో కుల, మతాలకు అతీతంగా చనిపోయిన వారందరికీ అంత్యక్రియలు చేస్తున్నాం.