నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి సాగర్‌ నీటి విడుదల

ABN , First Publish Date - 2021-08-10T07:07:28+05:30 IST

ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో సోమవారం నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి సాగర్‌ నీటి విడుదల

నాగార్జునసాగర్‌/చింతలపాలెం, ఆగస్టు 9: ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో సోమవారం నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు గా (311.7462 టీఎంసీలుగా) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 3,144 క్యూ సెక్కుల నీరు, ఎడమ కాల్వ ద్వారా 7,190 క్యూసెక్కుల నీరు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33,373 క్యూసెక్కుల నీటిని నాలుగు క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 32,360 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 78,467 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 65,702క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పులిచింతలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఇటీవల కొట్టుకుపోయిన 16వ నెంబర్‌ క్రస్ట్‌గేట్‌ స్థానంలో స్టాప్‌లాక్‌ గేట్‌ను అమర్చడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,798 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 12వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 75 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 147.14 అడుగుల(13.22టీఎంసీల) మేర నీరుంది.

Updated Date - 2021-08-10T07:07:28+05:30 IST