‘సాగర్‌’ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం పెంపు

ABN , First Publish Date - 2021-03-24T06:54:44+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలు, పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

‘సాగర్‌’ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం పెంపు
నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌

ఉదయం 7 నుంచి సాయంత్రం 7గంటల వరకు నిర్వహణ 

పోలింగ్‌ బూత్‌ల సంఖ్య సైతం పెంపు 


నల్లగొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలు, పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 293 పోలింగ్‌స్టేషన్లు ఉండగా అదనంగా 53 ఆక్సిలరీ పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తామని, కరోనా నేపథ్యంలో ఆ సంఖ్యను 1000కి కుదించి అదనంగా 53పీఎస్‌లు ఏర్పాటు చేశామన్నారు. సాగర్‌ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో వ్యవహరిస్తారని తెలిపారు. రిటర్నింగ్‌ అఽధికారి కార్యాలయం నిడమనూరు తహసీల్దార్‌  కార్యాలయంలో ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి గరిష్ఠంగా రూ.30.80లక్షలుగా నిర్ధారించినట్టు తెలిపారు.  

తొలి రోజు ఐదు నామినేషన్లు

ఇదిలా ఉంటే మొదటి రోజు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. నిడమనూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌కు అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు.

Updated Date - 2021-03-24T06:54:44+05:30 IST