ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు
ABN , First Publish Date - 2021-12-30T06:33:10+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి, ఆస్థానపరంగా స్వయంభువులను ఆరాధించి, కవచమూర్తులకు హారతి నివేదించారు.

శాస్త్రోక్తంగా అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు
యాదాద్రిటౌన్, డిసెంబరు 29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి, ఆస్థానపరంగా స్వయంభువులను ఆరాధించి, కవచమూర్తులకు హారతి నివేదించారు. బాలాలయ కల్యాణమండపంలో 108కలశాలకు వేదమంత్రోచ్ఛరణల నడుమ హోమపూజలు చేశారు. బాలాలయ మండపంలో నిత్య కల్యాణోత్సవం, ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చరనలు, మండపంలో అష్టోత్తరాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సాయంత్రంవేళ బాలాలయ కల్యాణమండపంలో స్వాతి నక్షత్రోత్సవ సేవ, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవాపర్వాలు నేత్రపర్వంగా సాగాయి. ఈ విశేష పూజాపర్వాలను దే వస్థాన అర్చకబృందం నిర్వహించగా సిబ్బంది పాల్గొన్నారు. స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా బాలాలయంలో ప్రభాతవేళ ధనుర్మాస వేడుకలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.12,41,124 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
విమానగోపురానికి విరాళం
యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడానికి బుధవారం స్థానిక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూ.3,01,500ను విరాళంగా దేవస్థాన ఈవో గీతారెడ్డికి అందజేశారు. అదేవిధంగా స్వామివారి విమాన గోపురం బంగారు తాపడానికి ఈనెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు చలాన్ ద్వారా రూ.9,90,186, ఆన్‌లైన్ ద్వారా రూ.5,30,638 చెక్కు లు, డీడీల ద్వారా 7,19,233 మొత్తం రూ.22,40,057 విరాళాలను పలువురు భక్తులు అందజేసినట్లు ఈవో తెలిపారు.
స్వామి వారి సేవలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి
యాదాద్రీశుడిని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు అర్చకులు ఆలయమర్యాదలతో స్వాగతం పలుకగా బాలాలయ కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు.