ఘనంగా సువర్ణ పుష్పార్చనలు

ABN , First Publish Date - 2021-02-27T05:10:52+05:30 IST

యాదాద్రీశుడి సన్నిధిలో శుక్రవారం పురస్కరించుకుని స్వామికి సువర్ణపుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవా పర్వాలను కన్నుల పండువగా నిర్వహించారు.

ఘనంగా సువర్ణ పుష్పార్చనలు
బాలాలయంలో ఊంజల్‌ సేవ నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 26: యాదాద్రీశుడి సన్నిధిలో శుక్రవారం పురస్కరించుకుని స్వామికి సువర్ణపుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవా పర్వాలను కన్నుల పండువగా నిర్వహించారు. వేకువజామునే స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను సువర్ణపుష్పాలతో అర్చించారు. మండపంలో స్వామి, అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించి, తులసీదళాలు, కుంకుమలతో అర్చించారు. అనంతరం కల్యాణ మండపంలో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలను ఆగమ శాస్త్ర పద్ధతిలో నిర్వహించారు. సాయంత్రం బాలాలయంలో కొలువైన ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వేదమంత్ర పఠనాలతో ఊరేగించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామిని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్‌, యూత్‌ కో ఆర్డినేటర్‌ ధర్మేందర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.8,96,063 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.


కొండపైన డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు 

యాదాద్రి క్షేత్రంలో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కొండపైన బాలాలయం, ప్రధానాలయం, శివాలయంతోపాటు దర్శనక్యూలైన్లు, దుకాణ సముదాయాల్లో జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్లతో పోలీసు బృందాలు తనిఖీ చేశాయి. అదేవిధంగా కొండకింద వైకుంఠద్వారం, స్వామివారి పాదాలు, రింగురోడ్డు తదితర ప్రాంతాల్లో డీసీపీ నారాయాణరెడ్డి పర్యటించి పనులను పరిశీలించారు. 

Updated Date - 2021-02-27T05:10:52+05:30 IST