స్తంభోద్భవుడికి పవిత్రమాలల ధారణ

ABN , First Publish Date - 2021-08-20T06:48:18+05:30 IST

స్వయంభు పాంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో గురువారం పవిత్రధారణలపర్వం వైభవంగా సాగింది. క్షేత్రపాశస్త్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు, ఏడాదిపాటు ఆలయ కైంకర్యాల్లో చోటుచేసుకున్న దోషనివారణ కోసం మూడు రోజులుగా యాదాద్రిలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి.

స్తంభోద్భవుడికి పవిత్రమాలల ధారణ
యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రిలో పవిత్రోత్సవాలు సమాప్తి

నేటి నుంచి లక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణ వేడుకలు


యాదాద్రి టౌన్‌, ఆగస్టు 19: స్వయంభు పాంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో గురువారం పవిత్రధారణలపర్వం వైభవంగా సాగింది. క్షేత్రపాశస్త్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు, ఏడాదిపాటు ఆలయ కైంకర్యాల్లో చోటుచేసుకున్న దోషనివారణ కోసం మూడు రోజులుగా యాదాద్రిలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు గురువారం వేదమంత్రాలతో పవిత్రీకరించిన సప్తవర్ణాల నూలు పోగులను స్వామి, అమ్మవార్లకు అలంకరించడంతో ఉత్సవాలు సమాప్తమయ్యాయి. తొలుత బాలాలయంలో ఉత్సవమూర్తులకు నవకలశాలతో స్నపన తిరుమంజనాలు నిర్వహించి దివ్యమనోహరంగా అలంకరించారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి పంచసూక్త, మూలమంత్ర హోమ పూజలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో మహాకుంభకలశాన్ని పవిత్రీకరించి న 108నూలు పోగులతో తయారు చేసిన మాలలను ఊరేగించారు. ప్రధానాలయంలోని స్వయంభువులకు, బాలాలయంలో సువర్ణ ప్రతిష్ఠాలంకారమూర్తుల చెంత పూజలు నిర్వహించి వాటిని స్వామి, అమ్మవార్లకు అలంకరింపజేశారు. ఈ వైదిక పర్వాలను దేవస్థాన అర్చకబృందం నిర్వహించగా సిబ్బంది పాల్గొన్నారు.


పాతగుట్ట ఆలయంలో..

యాదాద్రి అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వయంభువులకు పవిత్ర మాలధారణ పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయంలో అర్చకబృందం చతుస్థానార్చనలు, స్వామికి స్నపనతిరుమంజనాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో మూలమంత్రహవనం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. 108 నూలు దారాలతో చేసిన పవిత్రమాలలను ఆలయ శిఖరంపై సుదర్శన చక్రానికి, ప్రధానాలయంలోని స్వయంభువులకు, ప్రతిష్టాలంకార మూర్తులకు అలంకరింపజేశారు. 


నేటి నుంచి నిత్యకల్యాణాలు

యాదాద్రి క్షేత్రంలో ప్రవిత్రోత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శ న హోమ పూజలను రద్దు చేశారు. స్వామి, అమ్మవార్లకు పవిత్రధారణలతో ఉత్సవాలు సమాప్తమవడంతో శుక్రవారం నుంచి నిత్యకల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహహవన పూజలు తిరిగి ప్రారంభమవుతాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. కాగా, యాదాద్రీశుడిని రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌రావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకొని సువర్ణపుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు అర్చకులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉండగా, స్వామి వారికి భక్తుల నుంచి వివిధ విభాగా ల ద్వారా రూ.10,60,670 ఆదాయం సమకూరింది.

Updated Date - 2021-08-20T06:48:18+05:30 IST