ఆ భూములపై నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2021-05-18T06:45:22+05:30 IST

రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించిన గుర్రంబోడుతండా భూముల వ్యవహారంలో హైకోర్టు నివేదికలు కోరింది.

ఆ భూములపై నివేదిక ఇవ్వండి

సీఎస్‌ నుంచి సిమెంట్‌ పరిశ్రమ కంపెనీ వరకూ నోటీసులు

గుర్రంబోడుతండా కేసులో హైకోర్టు 

మఠంపల్లి, మే 17: రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించిన గుర్రంబోడుతండా భూముల వ్యవహారంలో హైకోర్టు నివేదికలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కలెక్టర్‌, లాండ్‌ సర్వేయర్‌, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గ్లోబల్‌ మినరల్‌ కంపెనీతో పాటు మరికొందరికీ సోమవారం నోటీసులు జారీ చేసింది. వివాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. గుర్రంబోడుతండా సర్వేనంబర్‌ 540లోని 1870ఎకరాలు ఎకరాల్లో దశాబ్దాల కాలంగా రైతులు సాగు చేసుకుంటుండగా, రెవెన్యూ అధికారుల అక్రమాలతో స్థానిక రైతులు భూములు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తమ అధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆందోళన చేపట్టిన రైతులు న్యాయం చేయాలని పాలకులను, అధికారులను విన్నవించుకున్నా ఫలితం లేదు. దీంతో భూములపై హక్కు కల్పించాలని ఉద్యమిస్తూనే కొన్ని నెలల క్రితం బాధిత రైతులు భూ పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కొంతకాలంగా న్యాయస్థానం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించి ఈ సర్వేనంబర్‌ భూముల్లో నెలకొన్న అక్రమాలు, భూకబ్జాలు, నకిలీ పట్టాలు, రైతులకు జరుగుతున్న అన్యాయంపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎస్‌ నుంచి సంబంధిత సిమెంట్‌ కంపెనీల వరకూ నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే ఇది వరకే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు స్పందనతో గుర్రంబోడు భూవివాదం పరిష్కారం అవుతుందనే ఆశాభావం బాధిత రైతుల్లో వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-05-18T06:45:22+05:30 IST