రణమా.. శరణమా!
ABN , First Publish Date - 2021-11-26T06:22:08+05:30 IST
అధికార పార్టీ నేతలు ప్రత్యేక ఆఫర్లతో స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. భారీగా నగదు, అభివృద్ధి పనుల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత పనులను పూర్తి చేయిస్తామంటూ స్వతంత్రులవెంట పడుతున్నారు.

స్వతంత్ర అభ్యర్థి ఖరీదు రూ.5లక్షలు మరింత పెరగనున్న రేటు
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
ఒక స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరణ, బరిలో ఏడుగురు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- నల్లగొండ): అధికార పార్టీ నేతలు ప్రత్యేక ఆఫర్లతో స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. భారీగా నగదు, అభివృద్ధి పనుల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత పనులను పూర్తి చేయిస్తామంటూ స్వతంత్రులవెంట పడుతున్నారు. పోటీ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, ఆలోచించండి, ఉపసంహరించుకోవాలంటూ ఫోన్లు చేస్తున్నారు. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల మూలాలను గుర్తించి వారిని పోటీనుంచి తప్పించేందుకు సామ, దాన, బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రయత్నాలు ఫలించి నకిరేకల్ మండలం బాబాసాయిగూడేనికి చెందిన తండు సైదులు గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
స్థానిక సంస్థల నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేనప్పటికీ ఎన్నికల కు వెళ్లడం అంటే ఇబ్బందికరమే అని అధిష్ఠానం నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారపార్టీకి చెందిన జిల్లా పెద్దలు ఈ పనుల్లో వేగం పెంచారు. పోటీకి వెళితే కనీసం రూ.10కోట్ల ఖర్చు, ఉత్కంఠ తప్పదు. స్వతంత్య్ర అభ్యర్థులు ఏ క్యాంపు నిర్వహించకుండా, డబ్బు పంచకుండా బరిలో ఉన్నా గులాబీ గూటిలోని ఓటర్లు అసంతృప్తితో స్వతంత్రుల వైపు ఏ మాత్రం మొగ్గుచూపినా అది పార్టీకే అవమానం అన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచా రం. పోటీ అనివార్యమైతే స్థానిక సంస్థల్లోని గులాబీ ఓటర్లు కొందరు ఖచ్చితంగా స్వతంత్రులకే ఓటు వేసే వాతావరణం ఉంది. విపక్షాలకు చెందిన 200ఓట్లకు తోడు అధికార పార్టీ నుంచి అసంతృప్తితో మరో 200ఓట్లు క్రాస్ అయితే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ గులాబీ గూటిలో జోరుగా సాగుతోంది.
స్వతంత్ర అభ్యర్థులకు భారీ ఆఫర్లు
గురువారం ఉదయంనుంచే స్వతంత్రులను ఉపసంహరింపజేసే పనిలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలు పడ్డారు. భారీగా నగదు, అభివృద్ధి పనుల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత పనుల ను పూర్తి చేయిస్తామంటూ గులాబీ నేతలు స్వతంత్రుల వెంట పడుతున్నారు. ‘పోటీ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, ఆలోచించండి, ఉపసంహరించుకోండి’ అంటూ అధికార పార్టీ నేతల నుంచి స్వతంత్ర అభ్యర్థులకు ఫోన్లు వెల్లువెత్తుతున్నా యి. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల మూలాలను గుర్తించి వారిని పోటీనుంచి తప్పించేందుకు సామ, బేధ దండోపాయాలను ప్రయోగించడం ప్రారంభించారు. నామినేషన్లు వేసిన వారు ఎవరి ఆధీనం లో ఉన్నారు, వారి అవసరాలు, స్థాయి గుర్తించి అందుకు తగిన విధంగా వారితో బేరసారాలు మొదలుపెట్టారు. మొత్తం 11మంది నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో ముగ్గురు తిరస్కరణకు గురికాగా, బుధవారం సాయంత్రానికి ఎనిమిది మంది మిగిలారు. అధికార పార్టీ నేతల ప్రయత్నాలు ఫలించి నకిరేకల్ మండలం బాబాసాయిగూడేనికి చెందిన తండు సైదు లు గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. తండు సైదులు నామినేషన్ వేయగా ఆయనకు మద్దతుదారులుగా ఆర్ఎ్సపీకి చెందిన నాయకులు నిలిచారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కనుసన్నల్లోనే పనిచేస్తారని, ఆయన ఆదేశిస్తే వారు వెనక్కి తగ్గే అవకాశం ఉందని పార్టీ పెద్దలకు సమాచారం అందడంతో జిల్లాకు చెందిన కీలక నేతలు వీరేశం సహాయాన్ని కోరారు. ఆయన వెంటనే స్పందించి విరమించుకోవాల్సిందిగా పోటీదారులను కోరడంతో ఉపసంహరించుకున్నట్లు స్వతంత్ర అభ్యర్థి తండు సైదులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కాగా గురువారం సాయంత్రానికి బరిలో ఏడుగురు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 26న సాయంత్రం ముగుస్తుండటంతో అధికార పార్టీనుంచి స్వతంత్ర అభ్యర్థులకు ఒత్తి డి పెరిగింది. ఇప్పటికే ఒక్కో అభ్య ర్థి రేటు రూ.5లక్షలుగా ఖరారైనట్లు సమాచారం. నేటితో ఉపసంహరణ గడువు ముగుస్తుండగా మధ్యాహ్నానికి ఉపసంహరణ రేటు భారీగా పెరుగుతుందన్న అంచనాలో స్వ తంత్ర అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది.
చివరకు బరిలో నిలిచేది ఎవరు?
స్వతంత్ర అభ్యర్థులు 10మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో అత్యధికులు కాంగ్రె్‌సకు చెందిన వారే. 10 మంది పోటీ చేయడం కన్నా ఉమ్మడి అభ్యర్థిగా ఒకరు బరిలో ఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని స్వతంత్రులు బుధవారం నల్లగొండలో సమావేశమయ్యారు. అయితే ఎవరు ఉండాలనేది ఇప్పటికీ స్పష్టంకాలేదు. అయితే చివరకు ఆలేరు జడ్పీటీసీ కుడుదుల నగేష్ లేదా నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలే అనేది స్పష్టం. తాము ఎలాగో బరిలో ఉండేది లేనందున అధికార పార్టీ ఇచ్చే ప్యాకేజీలను అందుకొని ఇంటిబాట పడితే మంచిదన్న ఆలోచనలో స్వతంత్రులుగా బరిలో దిగిన కొందరు ఉన్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలోనే పోటీలో ఉంటున్నామా? లేదా? అనేది తేల్చాలని జడ్పీటీసీలపై ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ల క్రమంలోనే తమ పార్టీ సానుభూతి పరులు, స్వతంత్రులైన వారు ఆరకంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కొద్ది గంటలే మిగిలి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాను తగ్గేది లేదని నగేష్ అంటుండగా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలే తనకు శిరోధార్యమని నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ
నల్లగొండ టౌన్: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజు గురువా రం ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన తండు సైదులు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్య 7కుచేరింది. ఉపసంహరణకు శుక్రవారం వరకు గడువు ఉం డటంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.