ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-07T06:15:15+05:30 IST

ఆరుతడి పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రుస్తాపూర్‌ గ్రామంలో, భువనగిరి మండలం హన్మాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.

ఆరుతడి  పంటలపై అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి


తుర్కపల్లి, భువనగిరి రూరల్‌, డిసెంబరు 6: ఆరుతడి పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రుస్తాపూర్‌ గ్రామంలో, భువనగిరి మండలం హన్మాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వచ్చే యాసంగిలో వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం లేదని, రైతులు ఆరుతడి పంటలపై అవగాహన పెంచుకొని ఆదాయం పొందాలని సూచించారు. ఆరుతడి పంటలైన వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వు లు, కుసుమలు, ఆముదాలు, పెసర, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటలు సాగుచేయాలన్నారు. ఆరుతడి పంటలపై రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు సూచనలు, సలహాలు అందించాలన్నారు. మండల వ్యవసాధికారు లు ప్రతి రోజు రెండు మూడు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వీటిని మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం రుస్తాపూర్‌లో పల్లెప్రకృతి వనాన్ని, హన్మాపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాధికారి అనురాధ, తుర్కపల్లి ఎంపీపీ భూక్య సుశీల, ఎంపీటీసీ మోహన్‌బాబు, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్‌, ఏవోలు దుర్గేశ్వరి, ఏవో ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈఓ దివ్య, సర్పంచ్‌ వంకరి లావణ్య, తదితరులు పాల్గొన్నారు.


సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

భువనగిరి రూరల్‌: రైస్‌ మిల్లుల నుంచి యాసంగి కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను, వానాకాలం ధాన్యం దిగుమతిని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సూచించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులతో భువనగిరిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్న 37మిల్లుల వద్ద వీఆర్‌వోలను నియమిస్తున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్‌లో మిగిలిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని వేగంగా పూర్తిచేయాలన్నారు. ప్రస్తుత వానాకాలం ధాన్యంతో వచ్చిన లారీలు మిల్లు పాయింట్‌ వద్ద ఎక్కువ రోజులు ఉండకుండా త్వరితగతిన దిగుమతి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీ వచ్చిన తేదీ, ఏ కేంద్రం నుంచి వచ్చింది, ఏ రోజు దిగుమతి చేశారో వివరాలను నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ఓపీఎంఎస్‌ ట్యాబ్‌ ఎంట్రీలను పరిశీలించాలన్నారు. మిల్లు వద్ద ఉన్న లారీల సమాచారాన్ని నిర్ణీత నమూనాలో ప్రతి రోజు మధ్యాహ్నం 2గంటల్లోగా కలెక్టర్‌ కార్యాలయానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, ఎస్‌.సూరజ్‌కుమర్‌, డీసీఎ్‌సవో బ్రహ్మారావు, పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:15:15+05:30 IST