డెక్కన్ సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రజామద్దతు
ABN , First Publish Date - 2021-12-10T05:29:54+05:30 IST
మండలంలోని మహంకాళిగూడెంలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రజామోదం లభించింది. పరిశ్రమ నిర్వాహకులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.8 మిలియన్ టన్నుల నుంచి 4.0 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు పర్యావరణ అనుమతుల కోసం ఈ అభిప్రాయ సేకరణను గురువారం నిర్వహించింది.

సానుకూలంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ఎన్జీవోలు
పాలకవీడు, డిసెంబరు 9 : మండలంలోని మహంకాళిగూడెంలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రజామోదం లభించింది. పరిశ్రమ నిర్వాహకులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.8 మిలియన్ టన్నుల నుంచి 4.0 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు పర్యావరణ అనుమతుల కోసం ఈ అభిప్రాయ సేకరణను గురువారం నిర్వహించింది. అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ అధ్యక్షతన పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 70 మంది అభిప్రాయాలు వెల్లడించగా, అందులో ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఎన్‌జీవోలు సైతం సంపూర్ణమద్దతు తెలిపారు. 212 మంది దరఖాస్తు రూపంలో అభిప్రాయాలను వెల్లడించారు. అభిప్రాయ సేకరణలో కాలుష్య నియంత్రణ మం డలి అధికారి రాజేందర్, ఎంపీపీ గోపాల్, జీఎం నాగమల్లేశ్వరరావు, తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీవో జానయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే
సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 70శాతం ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. అభిప్రాయసేకరణలో ఆయన మాట్లాడుతూ 70శాతం ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులను నేర్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కంపెనీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. డెక్కన్ సిమెంట్స్ విస్తరణకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
పరిశ్రమ విస్తరణతో పాటు కాలుష్య నియంత్రణ, పచ్చదనం కోసం విరివిరిగా మొక్కలు నాటాలని పలువురు కోరారు. స్థానికులకే ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. స్థానికేతరుడు మాట్లాడుతుండగా పలువురు అడ్డుకున్నారు. డీఎస్పీ రఘు కల్పించుకొని అతడిని మాట్లాడనిచ్చారు.
కాలుష్య నియంత్రణలో రాజీపడం: సీజీఎం శ్రీనివాసరాజు
డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో 70 శాతం ఉద్యోగులు స్థానికులే ఉన్నారని, ఇక ముందు కూడా అలాగే ఇస్తామని కంపెనీ సీజీఎం శ్రీనివాసరాజు అన్నారు. అర్హతలను బట్టి స్థానికులకే ఎక్కువశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నూతన ప్రాజెక్ట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ నూతన టెక్నాలజీ యంత్రాలు వాడుతున్నామని వాటితో కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. కాలుష్య నియంత్రణలో రాజీ పడేది లేదని; ఎంత ఖర్చయినా వెనుకాడబోమని అన్నారు. కార్మికుల పిల్లల విద్యాభ్యాసం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.