సై

ABN , First Publish Date - 2021-07-28T06:24:00+05:30 IST

చౌటుప్పల్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య ఈ నెల 26న చోటుచేసుకున్న మాటల యుద్ధం సీన్‌ మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి మారింది. చౌటుప్పల్‌ మునిసిపల్‌ కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.

సై
చౌటుప్పల్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదం (ఫైల్‌)

నేడు మునుగోడుకు మంత్రి జగదీ్‌షరెడ్డి

10 వేల మందితో నిరసన తెలుపుతామని ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి

పోలీసులు అప్రమత్తం

భారీ బందోబస్తుకు చర్యలు

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కేసు


నల్లగొండ, జూలై 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మునుగోడు: చౌటుప్పల్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య ఈ నెల 26న చోటుచేసుకున్న మాటల యుద్ధం సీన్‌ మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి మారింది. చౌటుప్పల్‌ మునిసిపల్‌ కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాలు, మంత్రి జగదీ్‌షరెడ్డి చేతిలోని మైక్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లాక్కోవడం వంటి ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. అభివృద్ధికి నిధులు తేకుండా, ప్రోటోకాల్‌ పాటించకుండా నియోజకవర్గానికి వస్తే అడుగడుగునా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాటల తూటాలు పేల్చారు. దానికి దీటుగా మంత్రి జగదీ్‌షరెడ్డి స్పందించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఇష్టంలేక కొందరు అడ్డుకుంటున్నారని, మీడియాలో ప్రచారం కోసం చిల్లర నాటకాలు వేస్తున్నారని, మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి వస్తానని ఆయన ప్రతి సవాల్‌ విసిరారు. ఈ రభస జరిగి గంటలైనా గడవకముందే మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి మంత్రి జగదీ్‌షరెడ్డి ఈ నెల 28న ఉదయం 10గంటలకు రానున్నట్టు పర్యటన ఖరారైంది. అదే సమయానికి మునుగోడులో 10వేల మందితో దళిత దీక్ష పేరుతో నిరసన కార్యక్రమానికి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సవాల్‌, ప్రతిసవాళ్ల నేపథ్యంలో మంత్రి కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు భారీగా జనసమీకరణకు నిర్ణయించారు. రేషన్‌ కార్డుల పంపిణీకి మంత్రి రానున్నారని, ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు తరలిరావాలని మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీపీ కర్నాటి స్వా మియాదవ్‌ పిలుపునిచ్చారు. దళితదీక్ష కోసం రాజగోపాల్‌రెడ్డి అనుచరులు సైతం మంగళవారం నుంచే భారీ జనసమీకరణకు ఏర్పాట్లు ప్రారంభించా రు. మంత్రి కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మునుగోడులో భారీ బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నారు. చండూరు మండలంలోని పుల్లెంలలో వైఎ్‌సఆర్‌టీఎస్‌ అధినేత్రి షర్మిల మంగళవారం నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షకు రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌లో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డిపై విమర్శలు చేశారు. అయితే దళిత దీక్షకు తన మద్దతు ఉంటుందని షర్మిల సైతం ప్రకటించారు. కాగా, మంత్రి, ఎమ్మెల్యే వివా దం ఎక్కడికి దారితీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు


ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు

చౌటుప్పల్‌ రూరల్‌: రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆటంకం కలిగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సభలో మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారని, ఆయన చేతిలోని మైకును ఎమ్మెల్యే లాక్కొని అవమానపరిచారని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమానికి ఆటంకం కలిగించడం, ఆహ్వానం లేని వ్యక్తులు వేదికపైకి వచ్చి గలాటా సృష్టించారని చౌటుప్పల్‌ తహసీల్దార్‌ గిరిధర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఐపీసీ 186, 353, 427సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా గలాటా సృష్టించిన కోమటిరెడ్డి అనుచరులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


మునుగోడులో టెన్షన్‌ టెన్షన్‌

మంత్రి, ఎమ్మెల్యే కార్యక్రమాల నేపథ్యంలో మునుగోడులో టెన్షన్‌ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మంత్రి జగదీ్‌షరెడ్డి కార్యక్రమానికి చండూరు, మునుగోడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిలుపు ఇవ్వడంతో కాంగ్రెస్‌ నేతలు సైతం టీఆర్‌ఎ్‌సకు దీటుగా కార్యకర్తలను మునుగోడుకు తరలించేందుకు రహస్య ఏర్పాట్లు పూర్తిచేశారు. మునుగోడుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో వారి కళ్లుగప్పి కార్యక్రమానికి చేరేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసులు కాంగ్రెస్‌ నేతలను రాత్రి లేదా తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి స్థానికంగా ఉంది. అంతేగాక రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలను పోలీసులు రప్పిస్తున్నారు. అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షిస్తారని తెలిసింది. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రజినీకర్‌ను సంప్రదించగా, నియోజకవర్గకేంద్రంలో మంత్రి కార్యక్రమం నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-07-28T06:24:00+05:30 IST