నేటి నుంచి మద్యం టెండర్ల ప్రక్రియ

ABN , First Publish Date - 2021-11-09T06:48:53+05:30 IST

ఉమ్మడి జిల్లాలో రెండేళ్ల కాలవ్యవధితో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు ఈ నెలతో ముగియనుంది.

నేటి నుంచి మద్యం టెండర్ల ప్రక్రియ
మద్యం దుకాణాల రిజర్వేషన్లకు డ్రా తీస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

ఎస్టీ, ఎస్సీ,గౌడలకు 30శాతం రిజర్వేషన్‌

లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు


మోత్కూరు, నవంబరు 8: ఉమ్మడి జిల్లాలో రెండేళ్ల కాలవ్యవధితో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు ఈ నెలతో ముగియనుంది. దీంతో 2021-2023 సంవత్సరాని కి గాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం మద్యం పాలసీని నోటీఫై చేసింది. గతంలో ఉన్న విధానాలకు కొద్ది మార్పులు మాత్రమే చేసింది.


ఉమ్మడి జిల్లాలో 320 దుకాణాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 320 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 155, సూర్యాపేట జిల్లాలో 99, యాదాద్రి జిల్లాలో 66 ఉన్నాయి. కొత్త గా మరో 60 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. యాదాద్రి జిల్లా అధికారులు 12 కొత్త దుకాణాలకు ప్రతిపాదించారు. వీటిలో ఎన్నింటిని ప్రభుత్వం ఆమోదిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 9వ తేదీ నుంచి మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండ గా, ఈనెల 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 18న డ్రా పద్ధతిన దుకాణాలు కేటాయించి, 20వ తేదీన లైసెన్సులు అందజేస్తారు.


తొలిసారి 30శాతం రిజర్వేషన్లు

మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం తొలిసారిగా రిజర్వేషన్లు అమలుచేస్తోం ది. గౌడ సామాజికవర్గానికి 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 చొప్పున, మొత్తం 30 శాతం మద్యం దుకాణాలు రిజర్వేషన్‌ కేటగిరీలకు కేటాయిస్తారు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీలో ఎక్సైజ్‌శాఖ, గిరిజనాభివృద్ధి, బీసీ సంక్షేమ, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రోస్టర్‌ విధానంలో రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. 


దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు

మద్యం టెండర్‌లో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడు రూ.2లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులనైనా ఫీజు చెల్లించి టెండర్‌ దాఖలు చేయవచ్చు. ఎక్సైజ్‌ రెంటల్‌(ఫీజు) విషయంలో ఎలాంటి మార్పులు లేవు. కాగా, గతంలో ఏడాదికి ఫీజు నాలుగుమార్లు చెల్లించాల్సి ఉండగా, దీన్ని ప్రభుత్వం ఆరు వాయిదాలకు పెంచింది. మొత్తం ఫీజులో 25శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన ఎక్సైజ్‌ ఫీజును ప్రభుత్వం నిర్ధారించింది.


ఎక్సైజ్‌ ఫీజు ఇలా...

జనాభా ఫీజు

5వేలు రూ.50లక్షలు

50వేలు రూ.55లక్షలు

1లక్ష రూ.60లక్షలు

5లక్షలు రూ.65లక్షలు

20లక్షలు రూ.85లక్షలు

20లక్షలపైన రూ.1.10కోట్లు


దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలి : కలెక్టర్‌ 

సూర్యాపేట(కలెక్టరేట్‌): జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మద్యం దుకాణాలకు రిజర్వేషన్ల కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ అధికారుల సమక్షంలో కలెక్టరేట్‌లో సోమవారం డ్రాతీసి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 99 మద్యం దుకాణాలు ఉండగా అందులో ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, గౌడ కులస్థులకు 27 మొత్తం 40 రిజర్వ్‌ అయినట్టు తెలిపారు.

Updated Date - 2021-11-09T06:48:53+05:30 IST