కార్తీక మాసోత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-11-02T06:05:08+05:30 IST

కార్తీక మాసంలో భక్తులు హరిహరుల ఆలయాలను అధికసంఖ్యలో సందర్శించి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మాసంలో భక్తులు కార్తీక దీపారాధన, సత్యనారాయణస్వామి వ్రతపూజలు, ఉపవాస దీక్షలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలకు తెలంగా

కార్తీక మాసోత్సవాలకు సర్వం సిద్ధం
లక్షపుష్పాలంకరణలో లక్ష్మీనృసింహుడు

యాదాద్రి టౌన్‌, నవంబరు 1: కార్తీక మాసంలో భక్తులు హరిహరుల ఆలయాలను అధికసంఖ్యలో సందర్శించి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మాసంలో భక్తులు కార్తీక దీపారాధన, సత్యనారాయణస్వామి వ్రతపూజలు, ఉపవాస దీక్షలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలకు తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రీశుడి సన్నిధి సిద్ధమైంది. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే పూజా కైంకర్యాల వివరాలను ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యా దాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఇటీవల వ్రతపూజా మండపాన్ని కొండకింద పాతగోశాలకు మార్చారు. అక్కడి రెండు హాళ్లలో బ్యాచ్‌కు 100 మంది దంపతులు వ్రతపూజలు చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపంలోనూ వ్రతపూజలు కొనసాగనున్నాయి. ఉదయం 6.30గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మొత్తం ఆరు బ్యాచ్‌లు వ్రత పూజల్లో పాల్గొంటాయి. 19వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 5.30 నుంచి సా యంత్రం 7గంటల వరకు ప్రతీ రెండు గంటలకు ఒక బ్యాచ్‌ చొప్పున ఎనిమిది బ్యాచ్‌లు వ్రత పూజల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. అనుబంధ ఆలయమైన పాతగుట్టలోనూ ఉదయం 7.00 గంటల నుంచి సాయత్రం 5.00 వరకు ఐదు బ్యాచ్‌లు వ్రత పూజల్లో పాల్గొనేలా ఏర్పాట్లుచేశారు. కొవిడ్‌ నిబంధనల నడుమ పూజా కైంకర్యాలు కొనసాగనున్నాయి. అదేవిధంగా భక్తుల రద్దీకి అనుగుణంగా సరిపడా లడ్డూ, పుళిహోర ప్రసాదాన్ని సిద్ధంచేస్తున్నారు.

శాస్త్రోక్తంగా ఏకాదశి లక్షపుష్పార్చన

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన  నిర్వహించారు.బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణలతో దివ్యమనోహరం గా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. స్వామివారి సహస్రనామ పఠనాలతో, పలు రకాల పుష్పాలతో లక్షపుష్పార్చనను అర్చకులు నిర్వహించారు. హరిహరులకు విశే ష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బాలాలయంలోని కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించి, పంచామృతాలతో అభిషేకించారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, చరమూర్తులకు నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. అష్టోత్తర శతరుద్రాభిషేకం, బిల్వపత్రాలతో అర్చనలు కొనసాగాయి. సాయంత్రం బాలాలయంలో అలంకార వెండి జోడు సేవోత్సవ పర్వాలు, సహస్రనామార్చన నిర్వహించారు. కాగా, స్వామి వారికి పలు విభాగాల ద్వారా రూ.8,90,908 ఆదాయం సమకూరింది.

Updated Date - 2021-11-02T06:05:08+05:30 IST