స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘పేట’ను ప్రథమస్థానంలో ఉంచాలి
ABN , First Publish Date - 2021-12-31T05:41:29+05:30 IST
: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూర్యాపేట ముని సిపాలిటీని మొదటి స్థానంలో ఉంచేందుకు పట్టణవాసులు, పాలకమండలి సభ్యులు సహకరించాలని మునిసిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ కోరారు.

మునిసిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ
సూర్యాపేటటౌన్, డిసెంబరు 30: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూర్యాపేట ముని సిపాలిటీని మొదటి స్థానంలో ఉంచేందుకు పట్టణవాసులు, పాలకమండలి సభ్యులు సహకరించాలని మునిసిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ కోరారు. జిల్లాకేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన మునిసిపల్ సాధారణ సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట పట్టణ, విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగు పర్చేందుకు సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నల్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మురుగు కాల్వల నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పనులకు మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో రూ.13 కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. పట్టణంలోని 48వార్డుల్లో నీటి సరఫరా జరగని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 1982 సంవత్సరంలో సూర్యాపేట పట్టణంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ నేటికీ అమలులో ఉన్నందున కొత్తప్రాతిపదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
సమస్యలపై గళమెత్తిన కౌన్సిలర్లు
మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు గళమె త్తారు. వార్డుల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, దోమలు, కోతుల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పలుమా ర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం వార్డుల్లో మౌలిక సదుపాయాలు కరువైతున్నాయని కౌన్సిలర్లు ప్రశ్నించారు.
దోమల బెడద విపరీతంగా ఉంది : కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్
సూర్యాపేట పట్టణంలో దోమల బెడద విపరీతంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా తయారైంది. మున్సిపాలిటీ చెత్తబండ్లు సరైన సమయంలో రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్ల మరమత్తులు పూర్తిచేయాలి : కట్కూరి కార్తీక్‌రెడ్డి, కౌన్సిలర్
పట్టణంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై దుమ్ము లేవకుండా నీరు చల్లించాలి. పలుచోట్ల కల్వర్టులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి.
పోల్‌లను తొలగించాలి: అనంతుల యాదగిరిగౌడ్, కౌన్సిలర్
పట్టణంలో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన జీయో పోల్‌లను తొలగించాలి. బీఎస్‌ఎన్‌ఎల్, బాక్సులను తొలగించాలి. మునిసిపల్ కార్మికులకు జీవో 60ప్రకారం పెంచిన జీతాలు ఇవ్వాలి.