విద్యుత్‌వైర్లు చోరీ చేస్తున్న ఐదుగురిపై పీడీ యాక్ట్
ABN , First Publish Date - 2021-12-15T05:41:34+05:30 IST
రియల్ ఎస్టేట్ వెంచర్లలో విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న జనగాం జిల్లాకు ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

భువనగిరిటౌన్, డిసెంబరు 14: రియల్ ఎస్టేట్ వెంచర్లలో విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న జనగాం జిల్లాకు ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదాద్రి జోన్ పరిధిలో ఏడు రియల్ ఎస్టేట్ వెంచర్లలో విద్యుత్‌వైర్లను చోరీ చేసిన కేసులో ఇప్పటికే ఐదుగురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిపై పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం.భగవత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగాం జిల్లా నెర్మెట మండలం ఆగపేట గ్రామానికి చెందిన ధరావత్ సురేష్, హన్మంతపురం గ్రామానికి చెందిన ధరావత్ లోకేష్, ధరావత్ రాకేష్, రఘనాథ్‌పల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన ముదావత్ తిరుపతి, తరిగొప్పల మండలం రూప్లాతండాకు చెందిన బూక్య వెంకటేష్ ముఠాగా ఏర్పడి వెంచర్లలోని విద్యుత్‌వైర్లను చోరీ చేసేవారు. ఈ క్రమంలో నవంబరు 25న పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అప్పటి నుంచి రిమాండ్ ఖైదీలుగా నల్లగొండ జిల్లా జైలులో ఉన్నారు. ఈ మేరకు చోరీ ఉదంతాలపై సమగ్ర విచారణ ఆధారంగా ఐదుగురిపై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు, నేరాలు పునరావృతం కాకుండా, శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో పీడీయాక్ట్ నమోదు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.