విషాదంలో మునగాల పరగణా
ABN , First Publish Date - 2021-10-21T06:43:17+05:30 IST
సూర్యాపేట జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త కొల్లు వరప్రసాదరావు(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
సాయుధ పోరాట యోధుడు ‘కొల్లు’ మృతి
గరిడేపల్లి రూరల్, నడిగూడెం, అక్టోబరు 20: సూర్యాపేట జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త కొల్లు వరప్రసాదరావు(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. మునగాల మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన కొల్లు భద్రయ్య, కాం తమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు కాగా వరప్రసాద్‌రావు పెద్దకుమారుడు. ఆయనకు భార్య అమృతమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అమ్మమ్మ స్వగ్రామం గరిడేపల్లి మండలం వెలిదండ కాగా గ్రామానికి చెందిన అమృతమ్మను వివాహం చేసుకున్న వరప్రసాదరావు అక్కడే స్థిరపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని మునగాల పరగణా రైతాంగానికి మద్దతుగా నిలిచారు. కేశబోయిన ముత్తయ్య, కొండపల్లి గోపాలకృష్ణయ్య, సిరిపురం, రామాపురం చెందిన నాయకులతో పనిచేశారు. చివరివరకూ కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను పాటించారు. 1982లో నడిగూడెంలోని రాజవారి కోటలో కొమరరాజు వెంకటలక్ష్మణరాయ సాహితీ సమాఖ్యను స్థాపించి పురావస్తు పరిశోధకుడు, కవి కుర్ర జితేందరబాబు రచించిన దేశిక సాహితి గ్రంథాన్ని, ముద్రించి ఆవిష్కరించారు. మూడు దశాబ్దాల కిందటే కొల్లు పాపయ్యచౌదరి 10ఎకరాల స్థలంలో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయగా, ఆ పక్కనే కొల్లు లక్ష్మీనర్సమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వరప్రసాదరావు స్థలాన్ని ఇచ్చారు. కొల్లు కోటయ్య మెమోరియల్ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థకు భూములు అందించడంలో జూనియర్ కళాశాల అభివృద్ధి అధ్యక్షుడిగా ఉన్నత విద్యకు కృషి చేశారు.
జమీందారు కాలం నుంచి
మునగాల పరగణాను పరిపాలించిన జమీందారు కాలం నుంచివిద్య, సాహిత్య అభివృద్ధి విశిష్ట సేవలందించిన కొల్లు వరప్రసాద్‌రావు మృతి పరగణాలో విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో మృతదేహాన్ని వెలిదండకు తీసుకువచ్చారు. అభిమానులు, గ్రామస్థులు వరప్రసాదరావు పార్థీవదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నాయకులు సుబ్బారావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు వక్కంతుల కోటేశ్వరరావు, మట్టి మనిషి వేనేపల్లి రంగారావు, న్యూడెమోక్రసీ కేంద్ర నాయకులు పోటు సూర్యం, పోటు లక్ష్మయ్య, కందుల వెంకటేశ్వర్లు, అంబటి నాగయ్య, సర్పంచ్ ఆదూరి పద్మ, కోటయ్య, కామళ్ల నవీన్, అంజయ్య, ప్రభాకర్, పుల్లయ్య, కనకారావు, మట్టపల్లి పాల్గొన్నారు.