పైసలిస్తేనే పౌతీ

ABN , First Publish Date - 2021-10-21T06:03:30+05:30 IST

అణాపైసా ఖర్చు లేకుండా చేయాల్సిన ఫౌతీకి కూడా రెవెన్యూ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మోతె మండల తహసీల్దార్‌

పైసలిస్తేనే పౌతీ
ప్రణయ్‌రెడ్డి నుంచి డబ్బులు తీసుకుని వెళ్తున్న ఆపరేటర్‌ సలీం(జేబులో చేయి పెట్టుకున్న వ్యక్తి)

 దబాయించి వసూలు చేస్తున్న ఆపరేటర్‌

 తహసీల్దార్‌ పేరు చెప్పి మరీ...

 రూ.8 వేలు ఇచ్చాకే ఫౌతీ చేసిన వైనం

మోతె, అక్టోబరు 20 : అణాపైసా ఖర్చు లేకుండా చేయాల్సిన ఫౌతీకి కూడా రెవెన్యూ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మోతె మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌ సలీం ఇందుకోసం ముక్కుపిండి సంబంధికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే తహసీల్దార్‌ అడిగితేనే చేస్తున్నానని బుకాయిస్తున్నాడు. రోజూ ఈ కార్యాలయంలో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. బుధవారం ఓ రైతు కుమారుడి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే మండలంలోని నామవరం గ్రామానికి చెందిన సరసాని వెంకట్‌రెడ్డి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. అయితే అతడి పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమిని కుమారుడు ప్రణయ్‌రెడ్డి పేరుమీదకు పౌతీ చేయించాలని కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రంతో స్లాట్‌ బుక్‌చేసుకున్నారు. బుధవారం పౌతీ  కోసం కుటుంబ సభ్యులతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. అయితే స్లాట్‌ బుక్‌ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోకి వెళ్లడంతోనే ఆపరేటర్‌ వారందరినీ బయటకు తీసుకువచ్చాడు. పౌతీ చేయాలంటే రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇది కూడా తహసీల్దార్‌ చెప్పాడని వారికి వివరించాడు. అంత ఇచ్చుకోలేరని స్థానిక రైతులతో పాటు కుటుంబ సభ్యులు ఆపరేటర్‌ను బతిమిలాడారు. అయినా రూ.20 వేలు ఇవ్వాలని ఆపరేటర్‌ అడిగాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న వీఆర్‌ఏ రూ.8 వేలకు ఒప్పించే ప్రయత్నం చేసినా వినలేదు. చేసేదేమీ లేక ప్రణయ్‌రెడ్డి ఊర్లోకి వెళ్లి రూ.8 వేలు తెచ్చి ఆపరేటర్‌కు ముట్టజెప్పాడు. ఈ డబ్బులు తనకు కాదని తహసీల్దార్‌కు అని, తనకు రూ.500 ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ఆయన కూడా రూ.200 ముట్టజెప్పాడు. ఈ తతంగాన్ని స్థానికులు వారి సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. గంటల తరబడి రైతులతో ఆపరేటర్‌ బేరసారాలాడుతున్నా అధికారి నుంచి ఎలాంటి మందలింపులు లేవు సరికదా ఆయన పంపితేనే వసూలు చేస్తున్నట్లు ఆపరేటర్‌ చెప్పాడు.  

గతంలో ఆపరేటర్‌ సస్పెన్షన్‌

రెవెన్యూ కార్యాలయంలో ధరణితో పాటు ఇతర పనులకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ డబ్బులు వసూలు చేస్తుండటంతో అతడిని సస్పెండ్‌ చేశారు. అయినా కూడా సిబ్బందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మామిళ్లగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నామవరం గ్రామానికి చెందిన రైతు ఉపేందర్‌ భూమిని తన తండ్రి పేరు మీద నుంచి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా డబ్బులు వసూలు చేసినట్లు తెలిపాడు. రిజిస్ట్రేషన్‌ కోసం మామిళ్లగూడెం, మోతె గ్రామాలకు చెందిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.  

రూ. 8 వేలు ఇస్తేనే పౌతీ చేశాడు  : ప్రణయ్‌రెడ్డి(నామవరం)

మా నాన్న వెంకట్‌రెడ్డి కరోనాతో మృతి చెందాడని నామవరానికి చెందిన ప్రణయ్‌రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో లక్షలు ఖర్చు చేశానని, పౌతీ  చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఇంత సమయం పట్టిందన్నారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఉన్నా, అమ్మ సంతకం పెట్టినా మార్చనని అన్నాడని ఆరోపించారు. కార్యాలయం వద్ద పడిగాపులు కాచి తహసీల్దార్‌కు వివరించినా పట్టించుకోలేదన్నారు. గత్యంతరం లేక అప్పు చేసి రూ.8 వేలు ఇచ్చానన్నాడు. ఆ తర్వాతే పౌతీ పని చేశాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

విచారణ చేపడతాం : తహసీల్దార్‌ కార్తీక్‌

ఆపరేటర్‌ సలీంపై గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని తహసీల్దార్‌ కార్తీక్‌ తెలిపారు. మరోమారు జరగకుండా చూసుకుంటానని అతడు చెప్పడంతో వదిలేశామన్నారు. బుధవారం నాటి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు. 


Updated Date - 2021-10-21T06:03:30+05:30 IST