సమయం లేదు మిత్రమా!

ABN , First Publish Date - 2021-03-22T06:16:46+05:30 IST

ఆస్తి పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తయ్యేలా కన్పించడంలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 17మునిసిపాలిటీల్లో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. మరో 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్నుల వసూలుపై దృష్టి సారించారు. అయితే వాణిజ్య, వ్యాపార సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే భారీగా ఉన్నాయి.

సమయం లేదు మిత్రమా!

ఆస్తి పన్నుల చెల్లింపునకు ముగుస్తున్న గడువు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మునిసిపాలిటీలు 

పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు 

ఈ నెల 31 చివరి తేదీ 

బకాయిల్లో సింహభాగం ప్రభుత్వ కార్యాలయాలవే..


ఆస్తి పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తయ్యేలా కన్పించడంలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 17మునిసిపాలిటీల్లో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. మరో 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్నుల వసూలుపై దృష్టి సారించారు. అయితే వాణిజ్య, వ్యాపార సంస్థలతోపాటు  ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే భారీగా ఉన్నాయి.


నల్లగొండ జిల్లాలో రూ.1,115 కోట్ల బకాయిలు

నల్లగొండ టౌన్‌/మిర్యాలగూడ టౌన్‌: ఆర్థిక సంవత్సరం ముగుస్తుం దంటే చాలు మునిసిపల్‌ అధికారుల్లో భయం పుట్టుకొస్తుంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు మునిసిపాలిటీల్లో రూ.కోట్లలో బకాయిలు ఉండగా, ఇప్పటి వరకు 70శాతం కూడా వసూలు కాలేదు. అన్ని ము నిసిపాలిటీల్లో కలిపి ఈ ఏడాది బకాయిలు రూ.3704.42కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2589.96కోట్లు వసూలు చేయగలిగారు. జిల్లాలో ఏడు మునిసిపాలిటీలు, నల్లగొండ, విర్యాలగూడ మేజర్‌ కాగా, దేవరకొండ, చిట్యాల,చండూరు, హాలియా, నందికొండ(సాగర్‌) ఉన్నాయి. వీటిలో నల్లగొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీలదే సింహభాగం. కొత్తగా ఏర్పడిన నందికొండ మునిసిపాలిటీలో నివాస గృహాలన్నీ ఎన్నెస్పీ పరిధిలో ఉండటంతో అక్కడ ఆస్తి పన్నులు వసూలు చేయడంలేదు. మిగిలిన ఆరు ము నిసిపాలిటీల్లో నల్లగొండలో 33,042 ఆస్తులు ఉండగా, ఈ ఏడాది రూ.35 17.38కోట్ల పన్నుల వసూలు లక్ష్యం విధించారు. అందులో 78శాతం మేర రూ.2440.87కోట్లు వసూలయ్యాయి.మిర్యాలగూడ మునిసిపాలిటీలో 228 49ఆస్తులు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.985.82కోట్ల ఆస్తి పన్ను లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.698.57కోట్లు వసూలు చేశారు. కొత్తగా ఏర్పడిన దేవరకొండ మునిసిపాలిటీలో 6652 ఆస్తులు ఉండగా, రూ.532. 074కోట్ల లక్ష్యానికి రూ.207.68కోట్లు వసూలు చేయగలిగారు. చిట్యాల మునిసిపాలిటీలో 3608 ఆస్తులకు రూ.82.74కోట్లు లక్ష్యం కాగా, రూ.62.79కోట్లు వసూలు చేశారు. చండూరు మునిసిపాలిటీలో 3211 ఆస్తులు ఉండగా, రూ98.16కోట్ల పన్ను లక్ష్యానికి రూ.48.17కోట్లు వసూలు చేయగలిగారు. హాలియా మునిసిపాలిటీలో 4870 ఆస్తులు ఉండగా, రూ.187.4కోట్లకు రూ149.9 కోట్లు వసూలు చేశారు.


ఫలితమివ్వని వడ్డీ రాయితీ

మునిసిపాలిటీల్లో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఆరు నెలలక్రితం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఇది ప్రారంభంలో కొంత సత్ఫలితాన్ని ఇచ్చినా, దీనిపై మునిసిపల్‌ యంత్రాంగం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించకపోవడంతో ఆర్థిక సంవత్సరం చివరలో అంతగా పన్నులు వసూలు చేయలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఆస్తులను జప్తు చేస్తాం : చీమ వెంకన్న, మునిసిపల్‌ కమిషనర్‌, మిర్యాలగూడ

పట్టణ ప్రజలు ఆస్తిపన్ను బకాయిలు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీచేశాం. ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇక ప్రైవేట్‌ ఆస్తులకు సంబంధించి మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు అందజేశాం. స్పందించని వారి ఆస్తులను చట్ట ప్రకారం జప్తు చేస్తాం. 


సూర్యాపేట జిల్లాలో...

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీలు ఉన్నాయి. తిరుమలగిరి, నేరేడుచర్ల కొత్తగా ఏర్పడ్డాయి. ఈ ఐదు మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు రూ.1,94,47,345 ఉన్నాయి.

సూర్యాపేట మునిసిపాలిటీలో..

సూర్యాపేట మునిసిపాలిటీలో 48వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 32వేల నివాస గృహాలు ఉన్నాయి. వీటి నుంచి పన్నులు వసూలు చేయాల్సిఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు రూ.11.83 కోట్లు వసూలు చేశారు. ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, అధికారులు వేగంగా లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల  బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల చెందిన 110 భవనాల నుంచి రూ.1.50కోట్లు రావల్సి ఉంది.


కోదాడ మునిసిపాలిటీలో..

కోదాడ మునిసిపల్‌ పరిధిలో 13,9321 రెసిడెన్షియల్‌, 438 నాన్‌ రెసిడెన్షియల్‌, 929 మిక్స్‌డ్‌, 598 రాష్ట్ర ప్రభుత్వ, రెండు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను లక్ష్యం రూ3.84 కోట్లు కాగా, రూ.3కోట్ల30లక్షలు వసూలు చేశారు. మొండి బకాయిలలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు ఉండగా, పన్ను చెల్లించని వారికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. 


హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీలో..

హుజూర్‌నగర్‌లో ఆస్తి పన్ను వసూళ్లు కొనసాగుతూ నే ఉన్నాయి. రూ.2కోట్ల 35లక్షల బకాయిలు రావాల్సి ఉండ గా, వాటిల్లో రూ.1.95కోట్లు వసూలయ్యాయి. మరో రూ.40లక్షలు వసూలు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రూ.36లక్షల 94వేలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు 83.05శాతం పన్నులు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.


తిరుమలగిరి మునిసిపాలిటీలో..

తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో 5966 ఆస్తులు ఉండగా, అందు లో 5166 నివాసగృహాలు, కమర్షియల్‌ 800 ఆస్తతలు ఉన్నాయి. ఆరు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వీటిలో ఐదు రాష్ట్ర ప్రభుత్వానివి, ఒకటి కేంద్ర ప్రభుత్వానిది. మూడు వివాదాస్పద నిర్మాణాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను లక్ష్యం రూ.కోటి84లక్షల 13వేలు కాగా, ఇప్పటివరకు రూ.1కోటి 10లక్షల 73వేలు వసూలు చేశారు. మొత్తం 60శాతం లక్ష్యం పూర్తయింది.


నేరేడుచర్ల మునిసిపాలిటీలో..

నేరేడుచర్ల మునిసిపాలిటీ బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. మొత్తం 3,749 గృహాలుండగా, పాత బకాయిలు మొత్తం రూ.64.16లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.26.73లక్షలు వసూలు చేయగా, రూ.23.89లక్షలు బకాయిలు ఉన్నాయి. 59.86 శాతం పన్నులు వసూలు చేయగా, ఇంకా రూ.34లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం 11ఉండగా అన్ని కార్యాలయాలు బకాయిపడ్డాయి.


బకాయిల వసూళ్ల లక్ష్యం పూర్తి చేస్తాం : రామాంజులరెడ్డి, సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌

మునిసిపాలిటీ పరిధిలో పన్ను వసూళ్ల బకాయిలను నూరు శాతం పూర్తిచేస్తాం. ఆస్తిపన్నుపై ఉన్న 90శాతం వడ్డీని మాఫీ చేశాం. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి.


యాదాద్రి జిల్లాలో రూ.5.42 కోట్లు..

 (ఆంధ్రజ్యోతి, యాదాద్రి): యాదా ద్రి భువనగిరి జిల్లాలో ఆరు మునిసిపాలిటీల పరిధిలో నివాస, వాణిజ్య, మిశ్రమ వినియోగ ఆస్తులు 39,646 ఉన్నాయి. వీటినుంచి ఏటా మునిసిపాలిటీలకు ఆస్తి పన్ను రూపంలో రూ.14.09కోట్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు ముంచుకు వస్తున్నా వసూళ్లలో పురోగతిలేక వెనుకబడింది. జిల్లావ్యాప్తంగా కేవలం 61శాతం మాత్రమే పన్నులు వసూలు కాగా, ఇంకా రూ.5.42కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో భువనగిరి ఒక్కటే పాతది. చౌటుప్పల్‌, పోచంపల్లి, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట మునిసిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో 13,800 ఆస్తు లు ఉండగా, రూ.6.15కోట్ల ఆస్తి పన్ను లక్ష్యం. మార్చి 15 నాటికి రూ.3.88కోట్లు వసూలు చేశారు. రూ.2.27కోట్ల బకాయి ఉంది. అదేవిధంగా చౌటుప్పల్‌లో రూ.2.58కోట్లకు రూ.1.66కోట్లు వసూలు చేశారు. పోచంపల్లిలో రూ.1.38కోట్లకు రూ.96.60లక్షలు, ఆలేరులో రూ.2.02కోట్లకు రూ.95.55లక్షలు, యాదగిరిగుట్టలో రూ.89.30లక్షలకు రూ.52.79లక్ష లు, మోత్కూరు మునిసిపాలిటీలో రూ.1.05కోట్లకు రూ.68.17లక్షలు వసూళ్లు చేశారు.

బకాయిల్లో ప్రభుత్వ సంస్థలవి రూ.1.38కోట్లు

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో రూ.5.42కోట్ల ఆస్తిపన్ను బకాయి ఉంది. భువనగిరి మునిసిపాలిటీలో రూ.2.27కోట్ల బకాయిలకు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినవే రూ.1.02 కోట్లు ఉన్నాయి. చౌటుప్పల్‌లో రూ.91.45లక్షల బకాయిలకు రూ.6.22లక్షలు ప్రభుత్వ ఆస్తుల బకాయి ఉంది. పోచంపల్లిలో రూ.41లక్షలకు ప్రభుత్వ భవనాలకు సంబంధించి రూ.2.50లక్షలు, ఆలేరులో రూ.1.06కోట్లకు రూ.11.92 లక్షలు, యాదగిరిగుట్టలో రూ.36.51లక్షలకు రూ.6లక్షలు, మోత్కూరులో రూ.37.53లక్షలకు రూ.8.76లక్షలు ప్రభుత్వ భవనాల ఆస్తిపన్నులే పేరుకుపోయాయి.

Updated Date - 2021-03-22T06:16:46+05:30 IST