యాసంగిలో సన్నాలు సాగు చేయండి
ABN , First Publish Date - 2021-10-29T06:18:14+05:30 IST
యాసంగిలో వరి సాగుకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సన్నాలను సాగుచేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.
ధర తగ్గించి ఇస్తే రశీదు తీసుకురండి
ఆ మొత్తాన్ని చెల్లించేలా చర్యలు
ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ, అక్టోబరు 28: యాసంగిలో వరి సాగుకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సన్నాలను సాగుచేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండల్లాల్లోని భూములు మెట్టపంటలకు అనువుగా ఉన్నందున వాటిని సాగు చేయాలన్నారు. మిగతా మండలాల్లో దొడ్డురకాలకు బదులు సన్న రకాల వరిని సాగుచేయాలన్నారు. యాసంగి వరి సాగుకు సాగర్ నుంచి నీటిని విడుదల చేయిస్తామన్నారు. మిల్లుల్లో బియ్యం ఖాళీకాకపోవడం, దీపావళికి ముందే కోతలు ప్రారంభమవడం, 14 మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో కొంత ఇబ్బంది తలెత్తిందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు మూడు రోజుల్లో అన్ని మిల్లుల ధాన్యం కొనుగోలు చేసే లా చర్యలు తీసుకున్నామన్నారు. మిల్లర్లు తేమ శాతం ఆధారంగా ధర చెల్లిస్తారన్నారు. మిల్లర్లు ఎవరికైనా తక్కువ ధర చెల్లిస్తే రైతులు రశీదు తీసుకుని తన క్యాంపు కార్యాలయానికిగానీ, డీఎస్పీ కార్యాలయానికి గానీ వస్తే తగ్గిన మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు అధికారులు, మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.