ఉద్యోగాలు లేవుగానీ కొత్త వైన్‌షాపులా ?

ABN , First Publish Date - 2021-11-10T05:24:31+05:30 IST

ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు లేవుగానీ, కొత్త మద్యం షాపులకు మాత్రం సీఎం కేసీఆర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

ఉద్యోగాలు లేవుగానీ కొత్త వైన్‌షాపులా ?
నార్కట్‌పల్లి మండలంలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

బీర్లు, బార్ల తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్‌

వైఎస్‌ బతికుంటే ఉదయసముద్రం ఎత్తిపోతల పూర్తయి దశాబ్దమయ్యేది

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు 

వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

నార్కట్‌పల్లి, నవంబరు 9: ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు లేవుగానీ, కొత్త మద్యం షాపులకు మాత్రం సీఎం కేసీఆర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 21వ రోజు మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బీ.వెల్లెంలనుంచి చౌడంపల్లి వరకు 7.5కి.మీల మేర పాదయాత్ర కొనసాగింది. అనంతరం అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా, రాష్ట్రాన్ని బార్లు... బీర్ల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు వస్తదో తెలియక విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం అలా చెప్పలేదని, అది సాధ్యమేనా అంటూ నిస్సిగ్గుగా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. కేసీఆర్‌ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకు సీఎం నిర్లక్ష్యమే కారణమన్నారు. ముఖ్యమంత్రికి ముందుచూపు ఉండాలని, అది కేసీఆర్‌కు లేకపోవడం రాష్ట్ర ప్రజల దుర దృష్టమన్నారు. 80వేల పుస్తకాలు చదివిన అపరమేథావినని చెప్పుకునే కేసీఆర్‌ రైతులు, ప్రజలకు ఏం మేలుచేశాడో చెప్పాలన్నారు. అంతకుముందు బ్రాహ్మణవెల్లంలలోని ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని ఆమె సందర్శించారు. కమీషన్ల కోసంవేల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం కట్టారని, 14 ఏళ్లయినా ఉదయసముద్రం ఎత్తిపోతలకు పైసా ఇవ్వలేదని ఆరోపించారు. వైఎ్‌సఆర్‌ బతికుంటే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తయి దశాబ్దకాలమయ్యేదని అన్నారు. 80శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.100కోట్లు ఇస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదన్నారు. కాగా, పాదయాత్రలో పలువురు రైతులు, వృద్ధులు, యువకులను ఆమె పలకరించారు. పల్లెప్రకృతివనంలో వైఎస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బీ.వెల్లెంలకు వచ్చిన షర్మిలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. నిరుద్యోగ నిరాహారదీక్షకు పలువురు మద్దతు తెలపగా, పద్మశాలి, మైనార్టీ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాదయాత్ర ఇన్‌చార్జి చంద్రహా్‌సరెడ్డి, పార్టీ నాయకులు పిట్ల రాంరెడ్డి, ఇరుగు సునీల్‌, ఏపూరి సోమన్న, పబ్బతిరెడ్డి వెంకట్‌రెడ్డి, పర్వతం వేణు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర నార్కట్‌పల్లి మండలంలో 7.5కిలోమీటర్లు కొనసాగగా, రాష్ట్రంలో మొత్తం 238 కి.మీలకు చేరింది. 

Updated Date - 2021-11-10T05:24:31+05:30 IST