నేతన్నకు చేయూత
ABN , First Publish Date - 2021-08-24T05:41:14+05:30 IST
చేనేత, పవర్‌లూం (మరమగ్గాలు) కార్మికులను ఆదుకునేందుకు ‘నేతన్నకు చేయూత’(త్రిఫ్ట్) పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
పథకానికి రూ.33 కోట్లు మంజూరు
త్రిఫ్ట్ పథకం అమలుకోసం అవగాహన సదస్సులు
జియోట్యాగింగ్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తింపు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25వేల మందికి లబ్ధి
భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 23: చేనేత, పవర్‌లూం (మరమగ్గాలు) కార్మికులను ఆదుకునేందుకు ‘నేతన్నకు చేయూత’(త్రిఫ్ట్) పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.33కోట్ల నిధులు వి డుదల చేసింది. పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని జిల్లా అధికారులకు చేనేత, జౌళిశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8,500 మగ్గాలు ఉండగా, ఈ పథకం ద్వారా 25,500 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక మగ్గం కార్మికుడికితోపాటు మరో ఇద్దరు అనుబంధ కార్మికులకు ఈ పథకం వర్తించనుంది.
పథకం అమలుకు కసరత్తు
‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా చేనేత, మరమగ్గాల కార్మికులతోపాటు అనుబంధ కార్మికులకు పొదుపు పథకం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులు గ్రామాలవారీగా పర్యటించి కార్మికులను గుర్తించే పనిలో ఉన్నారు. గతంలోనే ఈ పథకం అమలుకాగా, ప్రభుత్వం దీన్ని మరోమారు పునరుద్ధరించింది. చేనేత, మరమగ్గాల కార్మికులను గుర్తిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో సుమారు 6వేల మగ్గాలు ఉండగా, 18వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు ‘చేయూత’ లభించనుంది. ఇప్పటికే జియోగ్యాగింగ్ చేసిన మగ్గాలు నల్లగొండ జిల్లాలో 1918 ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 60, యాదాద్రి జిల్లాలో 5,900మగ్గాలు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 8,500 మగ్గాలు ఉండగా, నేతన్నకు చేయూత ఈ పథకం ద్వారా సుమారు 25,500 మందికి లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్ల క్రితం భూదాన్‌పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఈ పథకం కార్మికులకు గతంలో కొంత ఊరటనిచ్చింది. కాగా, ఏడాదిన్నర కాలంగా ఈ పథకం పునరుద్ధరణకు నోచుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఈ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు ఇలా..
చేనేత లేదా పవర్‌లూం మగ్గాలపై పనిచేసిన కార్మికులు అర్హులు. పూర్తి వివరాలు, జియోట్యాగింగ్, ఆధార్‌కార్డు, బ్యాంకు వివరాలు, మొబైల్ నెంబరు, సీనియారిటీ, నెలవారి వేతనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడిగా 18 ఏళ్లు దాటిన, ఆదాయంలో 50శాతం నేత పనిద్వారా వస్తే అతడిని గుర్తిస్తారు. నేతన్నకు చేయూత పేరుతో పొదుపు నిధిని ఏర్పాటుచేశారు. చేనేత సహకార సంఘాలతోపాటు సహకారేతరరంగంలోని జియోట్యాగింగ్ కలిగిన మగ్గాలపై పనిచేసే నేతన్నలు, అనుబంధ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. అనుబంధంగా ఉన్న డైయింగ్, డిజైన్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి పనుల్లో ఉన్నవారు అర్హులు. లబ్ధిదారుడు తన వేతనంలో 8శాతం బ్యాంకులో పొదుపు చేస్తే ప్రభుత్వం వాటా కింద 16శాతం జమ చేస్తోంది. ప్రతినెలా 15లోగా ఈ ప్రక్రియ చేపడుతారు. 36 నెలల పాటు పొదుపు చేసిన డబ్బును ఆ తర్వాత అందజేస్తారు. ఏదైనా కారణంతో పొదుపు చేసిన వ్యక్తి మృతిచెందితే ఆ మొత్తాన్ని అతడి కుటుంబీకులకు అందజేస్తారు. లబ్ధిదారుడు, సంబంధిత ఏడీ పేరున బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరుస్తారు.
సంఘాల వారీగా ప్రతిపాదనలు
ప్రస్తుత నెలాఖరులోగా అన్ని విభాగాల నేతన్నలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. క్షేత్రస్థాయి అధికారులు చేనేత సంఘాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జియోట్యాగింగ్ ప్రకారం లబ్ధి చేకూరేలా చూస్తాం. ఇప్పటికే ఈ పథకం అమలుకోసం దరఖాస్తు చేసుకునే విధానంపై చేనేత కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
విద్యాసాగర్, జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకుడు
నేతన్నలకు భరోసా కల్పించే పథకం
నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పునరుద్ధరించిన నేతన్నకు చేయూత (త్రిఫ్ట్) పథకం ప్రయోజనకరంగా ఉండనుంది. పెట్టుబడికి ఆసరాగా ఉంటుంది. ఆదాయంలో 8శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం రెండింతలు అంటే 16 శాతం జమ చేస్తుంది. ఈ పథకాన్ని నేత కార్మికులంతా సద్వినియోగం చేసుకోవాలి.
తడక రమేష్, పోచంపల్లి టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు.