నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ABN , First Publish Date - 2021-03-24T06:45:25+05:30 IST
కరోనా సెకండ్‌వేవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు, అక్కడి నుంచి జిల్లాకు వస్తుండడంతో కరోనా కూడా పల్లెలకూ విస్తరిస్తోంది.

పెరుగుతున్న కరోనా కేసులు, ప్రజల్లో కలవరం
జనతా కర్ఫ్యూకు ఏడాది, జాగ్రత్తలు మరిచిన జనం
భౌతిక దూరం లేదు, మాస్క్‌లపై అశ్రద్ధ
కరోనా సెకండ్‌వేవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు, అక్కడి నుంచి జిల్లాకు వస్తుండడంతో కరోనా కూడా పల్లెలకూ విస్తరిస్తోంది. వీటికితోడు వేలాది మందితో ఫంక్షన్లు, రాజకీయ సభలు, ఎన్నికల ప్రచారాలు జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే గతనెల రోజులుగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కలవరపరుస్తున్నాయి. టీకా ప్రభావంతో ఇక తగ్గిపోతుందనుకుంటున్న తరుణంలో మెల్లమెల్లగా మళ్లీ తన ప్రతాపం చూపుతోంది. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు అనివార్యం అంటున్నాయి వైద్యశాఖ వర్గాలు.
నల్లగొండ, మార్చి23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్(ఎ్‌సఎంఎ్‌స) అనే మూడు సూత్రాలను మరిచిపోవడంతో కరోనావ్యాప్తి జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. కరోనా పోయింది, ఏం చేయదనే నిర్లక్ష్యంతో సాధారణ రోజుల మా దిరిగా శుభకార్యాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం లో వేలాదిమందికి ఆత్మీయ సమావేశం పేరిట విందులు ఏర్పాటు చేశారు. తాజాగా సూర్యాపేటలో 15వేల మంది ఒకే మైదానంలో భౌతికదూరం నిబంధన బేఖాతరు చేస్తూ కూర్చున్నారు. దురాజ్‌పల్లి జాతర సాధారణ రోజుల మాదిరిగానే జరిగిపోయింది. ఆనిర్లక్ష్యం ఫలితం ప్రస్తుతం కరోనా పరీక్షల్లో స్పష్టమవుతోంది. విద్యాసంస్థలు కొనసాగించడం, క్లిష్టమైన ప్రయోగాలు ముగించుకొని స్వల్ప కాలంలోనే వ్యాక్సిన్ ముందుకురాగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవడంలేదు. ఏమవుతుందో అన్న అపోహల మూలంగా జిల్లాకు 7వేల మంది రెవెన్యూ శాఖకు చెందిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్ టార్గెట్ కాగా వారిలో 1100 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇలా అన్నిచోట్ల లోపాలమూలంగా జిల్లాలో కోరోనా పూర్వస్థితికి చేరుకుంటోంది.
ఈనెల మొదటి వారం నుంచి పెరుగుదల
మార్చి మొదటి వారం నుంచి పెరుగుదల కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆగస్టు, సెప్టెంబరులో పాజిటివ్ రేటు 20శాతం ఉండగా పలు చర్యలతో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టింది. ఈ మూడు నెలల్లో పాజిటివ్ రేటు 0.8శాతంగా ఉంది. మార్చి మొదటి నుంచి 13వ తేదీ వరకు పాజిటివ్ రేటు పెరిగి 1.5శాతానికి చేరింది. ఈ నెల 23 (మంగళవారం)న కరోనా పరీక్షలు నిర్వహించగా, నల్లగొండలో 50, సూర్యాపేటలో 24, యాదాద్రి భువనగిరి జిల్లా లో 37 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 3,28,201 టెస్టులు చేయగా ఇందులో 22,783 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 22,489 మంది రికవరీ అయ్యారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ రేటు 7.09 శాతం. రికవరీ రేటు 98.58 డెత్ రేటు 0.32, యాక్టీవ్ రేటు 1.10 శాతం.
గతంలో వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్
పభుత్వాల ఆదేశాలమేరకు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎస్పీల సహకారంతో పోలీ స్, మెడికల్ సిబ్బంది వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేశారు. అందుకోసం జిల్లాలో నాలుగు విడతలుగా లాక్‌డౌన్ విధించా రు. గతేడాది మార్చి 22న జనతా కర్ఫూ తో ప్రారంభమైన లాక్‌డౌన్ రాష్ట్రంలో, జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిం ది. మార్చి 23నుంచి 31వరకూ తొమ్మిది రోజులు, రెండో విడతలో ఏప్రిల్ 15నుంచి మే 31 వరకు 19రోజులు, మూడో విడత గా మే 4నుంచి 17వ తేదీ వరకూ 14 రోజులు, నాలుగో విడతగా మే 18నుంచి 31వరకు మళ్లీ 14 రోజులపాటు లాక్‌డౌన్ విధించి కరోనా వ్యాప్తి నివారణకు పనిచేశారు. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలో అన్‌లాక్ చేయగా, కొద్ది రోజుల పాటు జాగ్రత్తలు పాటించిన ప్రజలు మళ్లీ మరిచిపోయారు.
నేటి నుంచి విద్యా సంస్థలు బంద్
నల్లగొండ క్రైం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మెడికల్ కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలను బుధవారం నుంచి మూసి వేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 4,062 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, నల్లగొండ జిల్లాలో 2,044, సూర్యాపేట జిల్లాలో 1,310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 708 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ విద్యాసంస్థల్లో సుమారు 4లక్షలకు పైగా మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇకపోతే ఉమ్మడి జిల్లాలో సుమారు 2000కు పైగా ప్రైమరీ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఎంజీయూ పరిధిలో మొత్తం 207 కళాశాలలుండగా యూజీ కళాశాలలు 127, పీజీ 27, లా ఒకటి, ఎంబీఏ 6, ఎంసీఎ 1, బీఈడీ 38 తోపాటు ఫిజికల్ ఎడ్యూకేషన్, లైబ్రరీ సైన్స్, ఓరియంటల్ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో సుమారు లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇకపోతే జిల్లాలో 10 ప్రభుత్వ, 48 ప్రైవేటు ఇంటర్ కళాశాలలుఉండగా అం దులో సుమారు 20వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలు అన్నీ నేటి నుంచి మూతపడుతుండడంతో విద్యార్థులంతా ఆన్‌లైన్ తరగతులకు మళ్లనున్నారు. ఇకపోతే ఇంటర్, డిగ్రీ తరగ తులు రెండు నెలల క్రితం, 9,10 తరగతుల కు గత నెలలో భౌతిక తరగతులు ప్రారంభించగా, 6,7,8 తరగతులు ఫిబ్రవరి 24న ప్రారంభించగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో ఇతర రాష్ర్టాల్లో సైతం విద్యాసంస్థలు మూసివేయడంతో రాష్ట్రంలో సైతం పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 21,07,067 మందిపై కరోనా ప్రభావం
కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసా య, వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తున్న 21,0 7,067 మందిపై కరోనా ప్రభావం పడింది. కాగా నల్లగొండ జిల్లాలో 16,18,416 మంది జనాభా ఉండ గా, వారిలో 8,06,091మంది వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. 1,78,584 మంది వ్యవసాయం చేస్తుండగా, ఆరంగంపై ఆధారపడి 3,89,621 మంది శ్రామికులు, పారిశ్రామికరంగంలో 2,37,886 మంది పనిచేస్తున్నారు. అదేవిధం గా సూర్యాపేట జిల్లాలో 10,99,560 మంది జనాభా ఉండగా, వారిలో 5,61,528మంది పలు రంగాల్లో పనిచేస్తున్నారు. 1,07,226మంది రైతులు, ఆ రంగంపై ఆధారపడి మనె 3,15,838 మంది, 1,38,464 మంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7,39,448 మం ది జనాభా ఉండగా, వారిలో 3,57,353 మంది పలు విభాగాల్లో పని చేస్తున్నారు. 79,325 మంది రైతులు, దానిపై ఆధారపడి 1,48,335 మంది శ్రామికులు, 1,29,693 మంది పారిశ్రామికరంగంలో పనిచేస్తున్నారు. కాగా కరోనా సమయంలో వీరంతా పనులు లేక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు తప్పవు : కొండల్‌రావు, జిల్లా వైద్యశాఖాధికారి
వలసల మూలంగానే కేసులు పెరిగాయి. ఈనెల 18 వరకు 34 కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ మధ్య ప్రతి రోజు 20వరకు నమోదవుతున్నాయి. ఈనెల 23న ఒక్కరోజే 27 కేసులు నమోదయ్యాయి. ఐసీఎంఆర్ వారు రెండుసార్లు జిల్లాలో పరీక్షలు చేసినా 10 శాతానికి మించి పాజిటివ్ రేటు రాలేదు. ఈ పెరుగుదల స్థానికంగా జరిగింది కాదు. ప్రజలకు భయం పోయింది. ఒకశాతం మరణాలు కూడా లేకపోవడంతో అది మనల్ని ఏం చేయదనే నిర్లక్ష్యం, యువత లెక్కపెట్టకపోవడం. వ్యాక్సిన్‌కు అర్హత ఉన్నవారంతా తీసుకోవాలి.