భూదాన్‌పోచంపల్లిలో జాతీయ పర్యాటక దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-25T06:38:01+05:30 IST

జాతీయ పర్యాటక దినోత్సవాన్ని వచ్చేనెల 24న భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్నట్లు ఇండియన్‌ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అదనపు డైరెక్టర్‌ అమృత్‌ జోషి, ఐటీడీసీ రీజినల్‌ డైరెక్టర్‌ ఫరూక్‌ తెలిపారు.

భూదాన్‌పోచంపల్లిలో జాతీయ పర్యాటక దినోత్సవం
వివరాలు తెలుసుకుంటున్న ఐటీడీసీ అదనపు డైరెక్టర్‌ అమృత్‌ జోషి

ఈనెల 24న పోచంపల్లిలో, 25న శిల్పారాంలో వేడుకలు 

 ఇండియన్‌ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ అమృత్‌ జోషి 

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 24: జాతీయ పర్యాటక దినోత్సవాన్ని వచ్చేనెల 24న భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్నట్లు ఇండియన్‌ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అదనపు డైరెక్టర్‌ అమృత్‌ జోషి, ఐటీడీసీ రీజినల్‌ డైరెక్టర్‌ ఫరూక్‌ తెలిపారు. భూదాన్‌పోచంపల్లిలోని రూరల్‌ టూరిజం సెంటర్‌ను ఐటీడీసీ అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. ఈ సందర్భంగా భూదానగంగోత్రి ప్రాంగణంలోని ఆచార్య వినోబాభావే, వెదిరె రామచంద్రారెడ్డిల కాంస్యవిగ్రహాల వద్ద నివాళులర్పించారు. పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ వస్త్ర తయారీ ప్రక్రియలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, కమిషనర్‌ ఎన్నం సుదర్శన్‌, పాలకవర్గంతోపాటు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జాతీయ పర్యాటక వేడుకల్లో భాగంగా చేతి వృత్తుల, టెక్స్‌టైల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్‌పోచంపల్లిలో గ్రామీణ చేతి వృత్తులు, కళాకారుల ప్రదర్శనలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో నిర్వహించే రెండు రోజుల జాతీయ పర్యాటక దినోత్సవాల్లో హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఒకరోజు, భూదాన్‌పోచంపల్లిలో మరో రోజు నిర్వహించేందుకు, అవసరమైన ఏర్పాట్లు పరిశీలించే నిమిత్తం పోచంపల్లి గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు అమృత్‌ జోషి తెలిపారు.  

Updated Date - 2021-12-25T06:38:01+05:30 IST