అదే తరహా.. అవే మాటలు

ABN , First Publish Date - 2021-12-31T16:35:15+05:30 IST

అదే తీరు.. అవే మాటలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్మీ అధికారి పేరుతో రెండోసారి ఆన్‌లైన్‌ మోసం జరిగింది.

అదే తరహా.. అవే మాటలు

ఉమ్మడి జిల్లాలో రెండోసారి

ఆర్మీ ఆఫీసర్‌ పేరుతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌

మాయమాటలతో పేమెంట్‌ యాప్‌ ద్వారా డబ్బులు చోరీ

రాజాపేట, డిసెంబరు 30 : అదే తీరు.. అవే మాటలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్మీ అధికారి పేరుతో రెండోసారి ఆన్‌లైన్‌ మోసం జరిగింది. పక్కాగా తెలుసుకున్న సమాచారంతో లక్ష్యంగా ఎంచుకున్న వ్యాపారులకు ఫోన్‌ చేస్తున్న వ్యక్తి ఆ షాపు యజమానికి ఆర్డర్‌ ఇచ్చి, ఆపై డబ్బులు పంపిస్తా అంటూ పేమెంట్‌ యాప్‌ ద్వారా డబ్బులు లాగేస్తున్నాడు. తాజాగా యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామంలో ఎండీ రహీం చికెన్‌షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి గురువారం ఆర్మీ అధికారి సందీ్‌పకుమార్‌నంటూ 8926004948 నెంబరు నుంచి ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు. 15 కిలోల చికెన్‌ కావాలని ఆర్డర్‌ చేశాడు. కొద్దిసేపటల్లో వస్తా సిద్ధం చేసి పెట్టమన్నాడు. ఆర్డర్‌ ప్రకారం చికెన్‌ను సిద్ధం చేసిన రహీం ఫోన్‌ చేసి విషయాన్ని సదరు వ్యక్తికి తెలిపాడు. మొత్తం రూ.3400 బిల్లు అయ్యిందని తెలిపాడు. బిల్లు పంపిస్తా నేను పంపిస్తున్న లింక్‌ను ఓపెన్‌ చేశాక; రిక్వెస్ట్‌ పెట్టమని చెప్పాడు. రహీం అతడు చెప్పినవిధంగా  రిక్వెస్ట్‌ పెట్టాడు. ఆ కొద్దిసేపటి తరువాత గూగుల్‌ పేలో డబ్బులు వచ్చాయా లేదో చూసుకునే సరికి రహీం అతడి ఖాతాలోంచి ఒక్కసారి రూ.10వేలు, మరోసారి రూ.20వేలు అవతలి వ్యక్తికి వెళ్లిపోయాయి. దీంతో ఆన్‌లైన్‌లో రూ.30వేలు మోసపోయానని బాధితుడు రహీం గుర్తించి, స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 


ఇదే తరహాలో కోదాడలో..

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కూరగాయల వ్యాపారిని సైతం ఆర్మీ ఆఫీసర్‌నంటూ ఆన్‌లైన్‌లో మోసగించారు. ఈ నెల 17వ తేదీన ఈ ఉదంతం చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారికి ఆర్మీ ఆఫీసర్‌ షకీల్‌ పేరుతో వ్యక్తి ఫోన్‌ చేసి ఆర్డర్‌ చెప్పి, కట్టిపెట్టమన్నాడు. అతడు చెప్పిన ప్రకారం కట్టి ఫోన్‌ చేయగా, డబ్బులు పంపిస్తా గుగూల్‌ పేలో చూడండి అంటూ చెప్పాడు. రావడం లేదని వ్యాపారి చెప్పడంతో మీరు నాకు పంపించండి ఒకసారి చూద్దాం అంటూ అలా మూడు సార్లు డబ్బులు గూగుల్‌పే చేయించుకున్నాడు. ఇలా రూ.18 వేలు పంపించాక తీరా మోసపోయానని గుర్తించిన వ్యాపారి ఫోన్‌ చేసే సరికి స్విచ్ఛాఫ్‌ వచ్చింది.. 

Updated Date - 2021-12-31T16:35:15+05:30 IST