ఎన్జీ కళాశాలలో సగం మందికి పైగా ఫెయిల్‌

ABN , First Publish Date - 2021-12-31T06:29:32+05:30 IST

జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో, నాలుగో సెమిస్టర్‌లో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

ఎన్జీ కళాశాలలో సగం మందికి పైగా ఫెయిల్‌
కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

 డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్‌లో పడిపోయిన ఉత్తీర్ణత శాత

 సాంకేతిక లోపాలే కారణమని ఆరోపణ 

 ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా 

నల్లగొండ క్రైం, డిసెంబరు 30: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో, నాలుగో సెమిస్టర్‌లో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీనికి సాంకేతిక లోపం, పరీక్షల విభాగం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయిలో తరగతులు కాకున్నా, పరీక్షలు నిర్వహించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ప్రతిపతి కలిగిన ఎన్జీ కళాశాల పరీక్షలకు విద్యార్థులు హాజరైనా సాంకేతిక లోపాలతో గైర్హాజరైనట్లు నమోదైందని పలువురు ఆరోపిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సవరించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు ఇలా..

     కోర్సు సెమిస్టర్‌ హాజరు ఉత్తీర్ణత శాతం ఫెయిల్‌ శాతం

    బీఏ 2వ             196 49 25     147 75

         4వ             220 103 46.9 117 53.1

    బీకాం 2వ             348 73 21 275 79

        4వ             274 91 33.2 183 66.8

    బీఎస్సీ 2వ             378 154 40.7 224 59.3

    (ఫిజిక్స్‌) 4వ             367 245 66.7 122 33.3

బీఎస్సీ         2వ             310 110 35.4 200 64.6

(లైఫ్‌సైన్స్‌) 4వ             305 187 61.3 118 38.7


విద్యార్థులకు న్యాయం చేయాలి : పొట్టెపాక నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు 

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పరీక్షల విభాగం తప్పిదాలతో పాటు ప్రిన్సిపాల్‌, ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ పర్యవేక్షణ లోపం కారణం ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే పరీక్షల విభాగంలో సాంకేతిక లోపాన్ని సవరించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కరోనా కాలంలో తరగతులు పూర్తిస్థాయిలో కాకున్నా పరీక్షలు నిర్వహించి మానసిక ఒత్తిడి పెంచారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఉత్తీర్ణతశాతం తగ్గడమే దీనికి కారణం.


పరీక్షలు సరిగా రాయకుంటేనే ఫెయిల్‌ : చంద్రశేఖర్‌, ప్రిన్సిపాల్‌, ఎన్జీ కళాశాల 

పరీక్షలు బాగా రాయకుంటేనే విద్యార్థులు ఫెయిలవుతరు. పరీక్షల విభాగంలో ఎలాంటి లోపాలు ఉండవు. టెక్నికల్‌ సమస్య అసలే లేదు. పరీక్షల విభాగం పలుమార్లు పరిశీలించి అన్ని చూసుకున్నాకే ఫలితాలు ప్రకటించింది. విద్యార్థులు ఫెయిల్‌ కావడం, కళాశాల ఉత్తీర్ణత శాతం తగ్గడంలో పరీక్షల విభాగం తప్పిదం లేదు. 

Updated Date - 2021-12-31T06:29:32+05:30 IST