నేడు నల్లగొండకు మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-12-31T06:11:16+05:30 IST

మంత్రి కేటీఆర్‌ నల్లగొండలో ఈనెల 31న పర్యటించనున్నారు. ఆయనతోపాటు మంత్రులు జగదీ్‌షరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

నేడు నల్లగొండకు మంత్రి కేటీఆర్‌

నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రి కేటీఆర్‌ నల్లగొండలో ఈనెల 31న పర్యటించనున్నారు. ఆయనతోపాటు మంత్రులు జగదీ్‌షరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8.30కు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 10.30కు నల్లగొండకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి మునిసిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే కంచర్ల

మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గురువారం పరిశీలించారు. పానగల్‌ ఉదయసముద్రం వద్ద శిల్పారామం పార్కు ప్రతిపాదిత ప్రాంతం, వల్లభరావు చెరువును సందర్శించి చర్చించారు. అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఐటీ హబ్‌ శంకుస్థాపనకు ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు నల్లగొండ మునిసిపల్‌ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి పనులపై చర్చించారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల్లో గుంతలను అధికారులు పూడ్చివేయిస్తున్నారు. అయితే వీటిలో నాణ్యత లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-12-31T06:11:16+05:30 IST