భార్యతో గొడవపడి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-01T05:16:03+05:30 IST

భార్యతో గొడవపడి మద్యం తాగి ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్యతో గొడవపడి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
రామకృష్ణ (ఫైల్‌ఫొటో)

దేవరకొండ పట్టణం సబ్జిబజార్‌లో ఘటన 

దేవరకొండ, డిసెంబరు 31: భార్యతో గొడవపడి మద్యం తాగి ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణానికి చెందిన కంభంపాటి రామకృష్ణ (36) సివిల్‌ సప్లై గోదాంలో దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామకృష్ణకు ఆరేళ్ల క్రితం వనపర్తికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది.  వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామకృష్ణ తరచుగా మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. ఒకటి, రెండుసార్లు ఉరి వేసుకోవడంతో పాటు, పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబసభ్యులు చికిత్స చేయించగా కోలుకున్నాడు. తరచుగా భార్యతో గొడవకు దిగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు.  గురువారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య నాగలక్ష్మి పిల్లలను తీసుకొని ఇంటి నుంచి దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి రామకృష్ణ చనిపోతున్నానని భార్య తరుపు బంధువులకు ఫోన చేసి తెలిపాడు. తరచుగా మద్యం తాగి చనిపోతానని బెదిరిస్తుండటంతో బంధువులు కూడా మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని తేలికగా తీసుకున్నారు. రామకృష్ణ ఇంటిలోపలి తలుపు బిగించుకొని చీరతో ఫ్యానకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కిటికీలోనుంచి కాలనీవాసులు గమనించి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి మృతి చెంది ఉన్న రామకృష్ణను కిందికి దింపారు. దేవరకొండ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుని తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందగా నలుగురు అక్కలు వివాహాలు చేసుకొని హైదరాబాద్‌, గుంటూరు, మర్రిగూడ ప్రాంతాల్లో ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బీసన్న తెలిపారు. రామకృష్ణ తమ్ముడు కూడా రెండేళ్ల క్రితం ఉరి వేసుకొని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 


 

Updated Date - 2022-01-01T05:16:03+05:30 IST