తిరుమలగిరి దళితులకు మహర్దశ

ABN , First Publish Date - 2021-09-02T06:52:31+05:30 IST

తిరుమలగి రి మండల దళితుల దశ తిరగనుంది. తిరుమలగిరి మండలంలో దళితబంధు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తిరుమలగిరి దళితులకు మహర్దశ
తిరుమలగిరిలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌

దళితబంధు అమలుకు సీఎం నిర్ణయం

సుమారు 2500 కుటుంబాలకు లబ్ధి

దళిత బాంధవుడు కేసీఆర్‌ : ఎమ్మెల్యే కిషోర్‌

సూర్యాపేట/తిరుమలగిరి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : తిరుమలగి రి మండల దళితుల దశ తిరగనుంది. తిరుమలగిరి మండలంలో దళితబంధు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో తిరుమలగిరి మండలం ఒకటి. దీంతో అధికారుల లెక్కల ప్రకారం తిరుమలగిరి మునిసిపాలిటీతో పాటు మండలంలోని 16 గ్రామపంచాయతీల్లో  38,808 ఉండగా, అందులో 7,295 మంది ఎస్సీలు ఉన్నారు. సుమారు 2,500 దళిత కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ప్రాధాన్య క్రమంలో అందజేయనున్నట్లు సమాచారం. మొదటగా నిరుపేదలకు దళితబంధు అమలుకానుంది. ఆ తర్వాత మధ్యతరగతి, ఉన్నత తరగతి వారికి కూడా అమలు చేయనున్నారు. రూ.10 లక్షల నిధులతో వ్యాపారాలు, డెయిరీ, చికెన్‌ సెంటర్లు, కిరాణ, ఇనుప దుకాణాలు, ప్రైవేట్‌ ట్యాక్సీలు నడిపేందుకు వాహనాలను తీసుకోవచ్చు. ఎంపికపై ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శాకాలు రానప్పటికీ దళితుల జనాభా, కుటుంబాలు తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. తిరుమలగిరి మునిసిపాలిటీ, జలాల్‌పురం, గుండెపురి, తొండ, తాటిపాముల గ్రామంలో దళితులు అధికసంఖ్యలో ఉన్నారు. అన్ని మండలాల్లోనూ ఎస్సీలు అధికంగా ఉన్నారు.

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్యే కిషోర్‌

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. దళితబంధు పైలట్‌ ప్రాజెక్ట్‌గా తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బాణాసంచాకాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్‌, పూలె, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులుర్పించి, సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలోనే దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు. దళితబంధుతో దళితుల తలరాతలు మారుతాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, జడ్పీటీసీ దూపటి అంజలి, మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి,  టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, కౌన్సిలర్లు ఫత్తేపురం సరిత, శాగంటి అనసూయ, బత్తుల శ్రీను, కందుకూరి లక్ష్మయ్య, బాబు, త్రిశూల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T06:52:31+05:30 IST