ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-21T06:48:01+05:30 IST
రాష్ట్రంలోని పలుజిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

దేవరకొండ, మే 20 : రాష్ట్రంలోని పలుజిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం దేవరకొండలో సీఐ ఆదిరెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నిమ్మబావిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ బొంతల మూర్తి, అదే జిల్లా అన్వాడ బీసీ కాలనీకి చెందిన కారు డ్రైవర్ చంద్రశేఖర్ అలియాజ్ చందు ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ముఠాగా ఏర్పడి దేవరకొండ, వనపర్తి, కందుకూరు, తాండూరు ప్రాంతాలలో పలు చోరీలకు పాల్పడ్డారని సీఐ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్డు వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిద్దరూ పట్టుబడ్డారని తెలిపారు. విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని ఆయన వివరించారు. వారి వద్ద నుంచి 24 తులాల బంగారం, 2.3 కేజీల వెండి ఆభరణాలు, ఒక పల్సర్ వాహనం, రూ.20వేల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఇద్దరిపై వనపర్తి, మహబూబ్‌నగర్, కందుకూరు, వివిధ పోలీ్‌సస్టేషన్‌లలో 10 నుంచి 15 వరకు చోరీ కేసులు ఉన్నాయని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్లి వచ్చారని సీఐ తెలిపారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు తిరుమలేష్, హేమునాయక్, రవి, రాజులను సీఐ అభినందించారు.