స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కోటిరెడ్డి
ABN , First Publish Date - 2021-12-15T05:45:16+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏకైక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి మంకెన కోటిరెడ్డి గెలుచుకున్నారు. ఈ నెల 10న పోలింగ్ నిర్వహించగా, మంగళవారం నల్లగొండ డీఆర్డీఏ భవనంలో కౌంటింగ్ నిర్వహించి అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం 1233 ఓట్లు పోల్‌కాగా, అందులో 1183 చెల్లిన ఓట్లు, 50 చెల్లని ఓట్లు ఉన్నాయి.

తొలి ప్రాధాన్య ఓటుతోనే విజయం
చెల్లని ఓట్లు 50
గంటన్నరలోనే ముగిసిన కౌంటింగ్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏకైక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి మంకెన కోటిరెడ్డి గెలుచుకున్నారు. ఈ నెల 10న పోలింగ్ నిర్వహించగా, మంగళవారం నల్లగొండ డీఆర్డీఏ భవనంలో కౌంటింగ్ నిర్వహించి అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం 1233 ఓట్లు పోల్‌కాగా, అందులో 1183 చెల్లిన ఓట్లు, 50 చెల్లని ఓట్లు ఉన్నాయి. దీంతో 1183లో సగానికి ఒకటి అదనంగా చేర్చి 593 ఓట్లను విజయానికి కావాల్సిన కోటాగా నిర్ధారించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి మంకెన కోటిరెడ్డికి తొలి ప్రాధాన్యంలోనే 917 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎమ్మె ల్యే, యాదాద్రి జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగే్‌షకు 226 ఓట్లు పోలయ్యాయి. 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ దూరంగా ఉండగా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరుగు రు స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. బరిలో నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు, స్వతంత్ర అభ్యర్థి అయిన నల్లగొండ జడ్పీటీసీ లక్ష్మయ్యకు 26 వచ్చాయి. కాగా, మిగిలిన నలుగురు స్వతంత్రులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఉదయం 9.30గంటలకే ఫలితం వెల్లడైంది.
నల్లగొండలో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రా రంభం కాగా, సాయంత్రం మూడు గంటల వరకు ఈ ప్రక్రియ కొన సాగుతుందని కలెక్టర్ పీజే.పాటిల్ అంచనా వేసి సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. అయితే అధికార, విపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి లేకపోవడం, గెలుపునకు నిర్ణయించిన కోటా 593 ఓట్లు తొలి ప్రాధాన్యంలోనే ఎంసీ.కోటిరెడ్డికి రావడం చకాచకా సాగిపోయాయి. 50 ఓట్లు చెల్లకపోగా, అవి ఎక్కువగా అధికార పార్టీకి చెందినవే కావడంతో స్వతంత్ర అభ్యర్థులు, వారి ఏజెం ట్లు అడ్డుచెప్పకపోవడంతో లెక్కింపు ప్రక్రియ చకచకా సాగింది. 9.30 గంటలకు లెక్కింపు పూర్తి కాగా, 10 గంటలకు అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు కౌంటింగ్ కేంద్రానికి చేరుకు నే సమయానికే అభ్యర్థికి అందజేయాల్సిన ధ్రువీకరణ పత్రాన్ని సైతం అధికారులు సిద్ధం చేశారు. మంత్రి జగదీ్‌షరెడ్డి వచ్చాక టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పాటిల్, పరిశీలకుడు అహ్మద్ నదీమ్, ఎస్పీ ఏవీ.రంగనాథ్ అందజేశారు. కాగా, కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి దూరంగా టీఆర్‌ఎస్ శ్రేణులు నిలవగా, విజయం అనంత రం మంత్రితోపాటు కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రోడ్డుపైకి రాగానే కార్యకర్త లు టపాసులు పేల్చి, మిఠాయి పంచి సంబురాలు చేసుకున్నారు.
చెల్లని ఓట్లు 50
ఎమ్మెల్సీ ఎన్నికలో 1233 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, అందులో టీఆర్‌ఎస్ ఎన్నికల క్యాంపులో సుమారు 1000 మంది ఓటర్లు రెండు రోజుల పాటు ఉన్నారు. వీరందరికీ ప్రాధాన్య ఓటు ఎలా వేయాలో, ఎలా వేస్తే ఓటు చెల్లుతుందో శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థి నగేష్ సైతం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఫోన్ల ద్వారా పలకరించారు. ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాల్సిన విషయాన్ని ఆయన వివరించారు. అయినా జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేసిన ఓట్లల్లో 50 చెల్లుబాటు కాలేదు. బ్యాలెట్ పత్రంలో ఓటు వేయాల్సిన అభ్యర్థి పేరు ఉన్న గడి చివరలో ప్రాధాన్య క్రమంలో 1 లేదా 2 నంబర్లు వేయాల్సి ఉండగా కొందరు రైట్ మార్కు వేశారు. మరికొందరు ప్రాధాన్య క్రమం పేర్కొంటూనే సంతకం పెట్టారు. చెల్లని ఓట్లలో అధికార టీఆర్‌ఎ్‌సకు చెందినవే అధికంగా ఉన్నాయని ఆ పార్టీ ఏజెంట్ పేర్కొంటుండటం గమనార్హం.
నెరవేరిన కల
సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేసిన కోటిరెడ్డికి నాగార్జునసాగర్ నియోజకవర్గంపై పట్టుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డికి దగ్గరి అనుచరుడిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్వహించిన ఎన్నికల సమయంలోనూ జానారెడ్డి వెంటే ఉన్నారు. ఆ తర్వాతే గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. కానీ, 2014లో పోటీచేసి ఓటమి చెందిన నోముల నర్సింహయ్యకే పార్టీ అధిష్ఠానం తిరిగి టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికలో జానారెడ్డిపై నర్సింహయ్య గెలవగా, ఆయన హఠాన్మరణం అనంతరం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో సైతం కోటిరెడ్డి మరోమారు టికెట్ ఆశించి భంగపడ్డారు. నోముల తనయుడు భగత్‌కే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఎమ్మెల్యే కోటాలోనే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉండగా, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అది తప్పింది. దీంతో నెల రోజుల తేడాతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్ఠానం టికెట్ కేటాయించింది. సీఎం ఇచ్చిన హామీ కోసం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న తేరా చిన్నపరెడ్డిని సైతం పక్కన పెట్టి కోటిరెడ్డికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు టికెట్ ఆశించి భంగపడిన కోటిరెడ్డికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఊరించినట్టే ఊరించి దూరం కావడంతో కొంత నిరాశకు గురై న ఆయన అనుచరవర్గం, చివరికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఖరారు కావడంతో కొంత ఊపిరి పీల్చుకుంది. తాజా విజయంతో, చట్టసభల్లోకి అడుగుపెట్టాలనే కోటిరెడ్డి కల ఫలించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ : జగదీ్‌షరెడ్డి, మంత్రి
ప్రతిపక్షాల కుట్రలను రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఓటర్లు తిప్పికొట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ అవతరించింది. పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి జిల్లా సీఎం కేసీఆర్ వెంట నడుస్తోందనేది స్పష్టమైంది. ఈ భారీ విజయానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ గెలుపు దిక్సూచి. రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది. ప్రతిపక్షాలు ఎన్నో కుయుక్తులు పన్ని స్వతంత్రులను అభ్యర్థులను నిలబెట్టి బోర్లాపడ్డాయి. టీఆర్‌ఎస్ సైనికుల శక్తి ముందు కాంగ్రెస్ పలాయనం చిత్తగించింది. ఇకపై పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. ఈ విజయం మాపై మరింత బాధ్యత పెంచింది.
జిల్లా అభివృద్ధికి పాటుపడతా : మంకెన కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
నాపై నమ్మకం ఉం చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు. జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు రుణపడి ఉంటా. నా వంతుగా జిల్లా అభివృద్ధికి పాటుపడతా. ఈ ఎన్నికలో కాంగ్రె స్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా గెలుపు టీఆర్‌ఎ్‌సదే అని మరోమారు రుజువైంది.
అధికార పార్టీకి కాంగ్రెస్ నేతలు సహకరించారు : కుడుదుల నగేష్, స్వతంత్ర అభ్యర్థి
ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీకి కాంగ్రెస్ నేతలు సహకరించారు. పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడితే జడ్పీటీసీల ఫోరం నుంచి మేం పోటీపెట్టమని చెప్పాం. లేదా స్వతంత్రుల్లో ఎవరినైనా ఒకరిని బలపరచండని పీసీసీ అధ్యక్షుడిని అడిగాం, స్పందించలేదు. మా నేతలు మౌనంగా ఉన్నా సరిపోయేది కానీ, నాకు ఓటు వేయవద్దని ఓటర్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌చేసి చెప్పడం దారుణం. సీఎం స్థాయి నేతలమని చెప్పుకునే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల క్యారెక్టర్ ఏంటో ఈ ఎన్నికతో అందరికీ తెలిసిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎక్కడో పక్క జిల్లాలో ఓటు వేశారట. కుమారుడి పెళ్లి ఉందనే కారణంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఓటే వేయలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో కాంగ్రె్‌సకు అత్యధిక ఓట్లు ఉన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే, మరి పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు?
అభ్యర్థులు వచ్చిన ఓట్లు
మంకెన కోటిరెడ్డి 917
కుడుదుల నగేష్ 226
వంగూరి లక్ష్మయ్య 26
కాసర్ల వెంకటేశ్వర్లు 6
కొర్ర రాంసింగ్ 5
ఏర్పుల శ్రీశైలం 3
బెజ్జం సైదులు 0
మొత్తం 1183
చెల్లని ఓట్లు 50
మొత్తం ఓట్లు 1233