జాతర నిధులు తాత్కాలిక పనులకేనా?

ABN , First Publish Date - 2021-02-26T05:35:51+05:30 IST

పెద్దగట్టుకు కేటాయించిన నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పనులకు రూ.1కోటి 33లక్షల 88వేలు కేటాయించారు. ఇవన్నీ తాత్కాలిక పనుల నిర్వహణకే కావడం గమనార్హం.

జాతర నిధులు తాత్కాలిక పనులకేనా?
దురాజ్‌పల్లికి వెళ్లే మార్గంలో ఏర్పాటుచేసిన బ్యారీకేడ్లు

పెద్దగట్టుకు ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయింపు

గతంలో చేసినవే, కొత్త పనులు ఏవీ లేవు

చివ్వెంల, ఫిబ్రవరి 25: పెద్దగట్టుకు కేటాయించిన నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పనులకు రూ.1కోటి 33లక్షల 88వేలు కేటాయించారు. ఇవన్నీ తాత్కాలిక పనుల నిర్వహణకే కావడం గమనార్హం. గతంలో శాశ్వత నిర్మాణాలకు అయిన వ్యయంలో 70శాతం నిధులు ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు, రంగులకే కేటాయించడంపై విమర్శలు వినవస్తున్నాయి. గతంలో లక్షల్లో వ్యయం చేసి ప్రస్తుతం కోటికి పైగా ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.25లక్షలతో గుట్ట చుట్టూ, గుట్ట కింద లైటింగ్‌ జనరేటర్ల ఏర్పాటు చేశారు. రూ.7.90లక్షలతో జాతీయ రహదారి నుంచి గుడి మెట్ల వరకు, కోనేరు చుట్టూ బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. రూ.9.50లక్షలతో గుడికి కుడి, ఎడమ వైపున తాత్కాలిక మరగుదొడ్లు నిర్మించారు. రూ.7.40లక్షలతో పారిశుధ్య కార్మికులకు కావాల్సిన పరికరాలు, రూ.9.70లక్షలతో బ్లీచింగ్‌ పౌడర్‌, లైమ్‌ పౌడర్‌, రూ.18.50లక్షలు కూలీలు, ట్రాక్టర్ల కిరాయి, రూ.6లక్షలు పిచ్చి చెట్ల తొలగింపునకు కేటాయించారు. అదేవిధంగా ఖాసీంపేట, తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపుల పిచ్చిమొక్కల తొలగింపునకు రూ.5.60లక్షలు, కోనేరుకు రంగుల కోసం రూ.5.60లక్షలు, గుట్ట వద్ద మరుగుదొడ్లకు తాత్కాలిక మరమ్మతులకు రూ.6.90లక్షలు, సోలార్‌ లైట్లకు రూ.19లక్షలు, నిఘా కెమెరాలకు రూ.13.20లక్షలు, గుట్టపై రక్తపు మరకలు తుడిచేందుకు జెట్టింగ్‌ మిషన్‌ను కొనుగోలుకు రూ.45.80లక్షలు కేటాయించారు. గుట్ట వద్ద మొత్తం ఎనిమిది జోన్లకు 18 మంది కూలీలను ఐదు రోజుల పాటు మూడు షిఫ్టులకు వినియోగించనున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు స్కావెంజర్లను ఏర్పాటు చేశారు. కాగా, గత జాతరలో కొద్దిపాటి నిధులతోనే ఈ పనులన్నీ జరగ్గా, ప్రస్తుతం కోట్ల రూపాయాలు కేటాయించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఓ అధికారి, ఎవరి మాటను ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా వేలల్లో అయ్యే పనులకు లక్షలు కేటాయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


నిధుల దుర్వినియోగం లేదు : రామాంజులరెడ్డి,   పేట మునిసిపల్‌ కమిషనర్‌

దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు మున్సిపాలిటీ ద్వారా కేటాయించిన నిధులు దుర్వినియోగం కాలేదు. ఖర్చు పెట్టిన ప్రతీ పనికి లెక్క ఉంది. పని పూర్తయిన తర్వాత ఎంబీ రికార్డులను చూసే నిధులు ఇస్తాం.

Updated Date - 2021-02-26T05:35:51+05:30 IST