నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-25T06:18:54+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్స రం వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 44పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
జిల్లా కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఐఈవో జానపాటి కృష్ణయ్య

హాజరుకానున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు 

 ఒక్క నిమిషం నిబంధన అమలు 

ప్రతి పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్‌ గది 

 జిల్లావ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు

సూర్యాపేట అర్బన్‌/ నేరేడుచర్ల, అక్టోబరు 24: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్స రం వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 44పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.30గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతీ కేంద్రంలో ఐసోలేషన్‌ గదులను ఏర్పాటుచేశారు. 

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో 44పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో పారిశుధ్య పనులను చేపట్టి ముందస్తు చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో పరీక్షా హాల్‌లో శానిటైజేషన్‌ చేశారు. జనరల్‌ కోర్సులో 7,961 మంది, ఒకేషనల్‌ కోర్సులో 1,684మంది మొత్తంగా 9,745మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 44మంది చీఫ్‌ సూపరిం టెండెంట్లు, 44మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఆరుగురు సిట్టింగ్‌ స్కాడ్స్‌, ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను, థర్మల్‌ స్ర్కీనింగ్‌, వైద్య సిబ్బందితో పాటు విద్యార్థులు పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సైకాలజిస్టులను అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ పరీక్షలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉదయం ఆరు గంటల నుంచే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు గుడిపాటి లక్ష్మయ్య పరిశీలించారు. 

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం 

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

- జానపాటి కృష్ణయ్య, డీఐఈవో

Updated Date - 2021-10-25T06:18:54+05:30 IST