ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు

ABN , First Publish Date - 2021-10-31T05:51:32+05:30 IST

కేసీఆర్‌ రూ.వందల కోట్లు వెచ్చించి దేవుని గుడి నిర్మిస్తే పుణ్యం రాదని, ప్రజా సమస్యలు పరిష్కరించనప్పుడే పుణ్యం వస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు
మహాధర్నాలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారా ? 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

యాదాద్రి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ రూ.వందల కోట్లు వెచ్చించి దేవుని గుడి నిర్మిస్తే పుణ్యం రాదని, ప్రజా సమస్యలు పరిష్కరించనప్పుడే పుణ్యం వస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం మహాధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లని, వారికి సేవ చేయకుండా, వారి సమస్యలను పరిష్కరించకుండా, మళ్లీ ఎన్నికల్లో గెలుస్తానని కేసీఆర్‌ అనుకుంటే అది ముమ్మాటికీ తప్పని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే, రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయ న్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని పోరాటాలు చేస్తే తప్ప, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా హుజూరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నారని, ఈ జిల్లాలో ఓట్లు లేవు కాబట్టి సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. కేసీఆర్‌, ఈటల మధ్య తీవ్ర పోటీ నడుస్తుందని, ఓట్ల కోసం దళితులకు ప్రతీ ఇంటికి రూ.10లక్షలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటుకు రూ.6వేలు చెల్లిస్తున్నట్లు మీడియా చెబుతోందని, ఒక్క ఓటుకు ఇంత రేటు ఇంతకు ముందెన్నడూ లేదన్నారు. ఈ ప్రభుత్వాలు ఎన్నికలప్పుడే ప్రజలను చూడటం తప్ప, ఆ తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. వరి పండించొద్దని ప్రభుత్వం ప్రకటించిందని, వరి మాత్రమే సాగు చేసే భూముల్లో ఏమి సాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యం కొనమని లేఖలు రాస్తుంటే, బండి సంజయ్‌ మాత్రం ధాన్యం కొనుగోలు చేయాలని దీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేక వాతావరణం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో ప్రజలు మోదీ, కేసీఆర్‌ పాలనకు గోరీ కట్టడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, చంద్రారెడ్డి, దాసరి పాండు, మాటూరి బాలరాజు, సిర్పాంగ స్వామి, మాయ కృష్ణ, వెంకటేష్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-31T05:51:32+05:30 IST