హోరాహోరీ
ABN , First Publish Date - 2021-03-24T06:50:29+05:30 IST
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగే పోటీలను చూసేందుకు రెండోరోజూ క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. వీరితో పాటు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు.

రసవత్తరంగా సాగుతున్న కబడ్డీ పోటీలు
రెండో రోజూ తరలివచ్చిన క్రీడాభిమానులు
సూర్యాపేటలో ఉత్సాహంగా జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
సూర్యాపే క్రైం: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగే పోటీలను చూసేందుకు రెండోరోజూ క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. వీరితో పాటు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ జాతీయ స్థాయి జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీలు మంగళవారం రసవత్తరగా సాగాయి. సాయంత్రం 4గంటల రాత్రి 11 గంటల వరకు పోటీలు కొనసాగాయి. పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు, మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున తరలివచ్చి వీక్షించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
క్రీడాకారులకు ఏర్పాట్లు
జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జరుగుతుండడంతో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు క్రీడా మైదానంలో నాలుగు ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. క్రీడాకారులు, క్రీడలను వీక్షించేందుకు వచ్చే మహిళలు, ఇతరులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు.
కబడ్డీ పోటీలకు పటిష్ట బందోబస్తు
కబడ్డీ పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్ తన సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి రెండో రోజు జరిగిన క్రీడాపోటీలను తన తండ్రి చంద్రారెడ్డితో కలిసి వీక్షించారు. మొదటిరోజు క్రీడలు ప్రారంభానికి ముందు ప్రమాదం జరగడంతో క్రీడల ప్రారంభానికి రాలేదు. ఆస్పత్రుల్లో ఉన్న క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. అయితే రెండో రోజు సాయంత్రం క్రీడా మైదానానికి చేరుకుని తెలంగాణకు చెందిన బాలుర,బాలికల జట్లు ఇతర రాష్ర్టాల జట్లతో ఆడిన మ్యాచ్‌లను వీక్షించారు. అంతేగాక తెలంగాణ బాలికలు క్రీడల్లో ప్రతిభ కనబర్చుతుండడంతో చప్పట్లు కొడుతూ ఎంతో ఉత్సాహంతో వారిలో జోష్ నింపారు. రాష్ట్ర బాల, బాలికల జట్లను మంత్రి జగదీ్‌షరెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌కు పరిచయం చేశారు. తొలుత జాతీయ గీతాన్ని ఆలపించి మ్యాచ్‌ను ప్రారంభించారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాల నుంచి సూర్యాపేటకు వచ్చిన అన్ని రాష్ర్టాల క్రీడాకారులకు మంత్రి జగదీ్‌ష రెడ్డి, తన తల్లి సావిత్రమ్మ స్మారకంగా క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.
గాయపడిన క్రీడాకారులకు ప్రఽథమచికిత్స
పోటీల్లో గాయపడిన క్రీడాకారులకు వైద్యఆరోగ్య శాఖా సిబ్బంది వెంటనే ప్రఽథమ చికిత్స అందిస్తున్నారు. క్రీడలు జరిగే ప్రాంతంలో రెండు వైద్య బృం దాలను ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు తీవ్రంగా గాయమైతే వెంటనే అం బులెన్స్ ద్వారా పట్టణంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
క్రీడాపోటీలను వీక్షించిన ప్రముఖులు
రెండోరోజు జరిగిన పోటీలను పలువురు ప్రముఖులు వీక్షించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, మునిసిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మార్కెట్ చైర్‌పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, మునిసిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్‌కుమార్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం, రవీందర్‌రెడ్డి, భూక్యా సంజీవనాయక్, మర్ల చంద్రారెడ్డి, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నిర్వాహకులు జగదీ్‌ష, శ్రీనివా్‌సగౌడ్, గుజ్జ యుగంధర్‌రావు, రాంచందర్‌గౌడ్ వీక్షించారు. అర్జున అవార్డు గ్రహీత అజయ్‌ఠాకూర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు హాజరయ్యారు. అయితే అజయ్‌ఠాకూర్‌ను గుర్తించిన ప్రేక్షకులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.