తొలిరోజు హాజరు 22.39 శాతమే

ABN , First Publish Date - 2021-09-02T07:04:19+05:30 IST

బుడి బుడి అడుగులు బడివైపు పరిగెత్తాయి. ఇన్నాళ్లు ఆడిపాడిన బాలలు బరువెక్కిన బ్యాగులను భుజాలపై మోసుకుంటూ తరగతి గది కి చేరుకున్నారు. అప్పటికే వచ్చిన కొందరిని పలకరిస్తూ, రాని వారి గురించి ఆరా తీస్తూ అల్లరి చేశారు. చాలారోజుల తర్వాత కన్పించిన గురువులకు నమస్కరించి, విద్యాభ్యాసం ప్రారంభించారు.

తొలిరోజు హాజరు 22.39 శాతమే
కనగల్‌ మండలం రేగట్టె పాఠశాలలో ఆరుబయట విద్యార్థులకు పాఠాలు

ప్రభుత్వ పాఠశాలలకు హాజరైన విద్యార్థులు అంతంతే

ప్రైవేట్‌ పాఠశాలలకు 16.02 శాతం మాత్రమే హాజరు

తొలిరోజు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం

పలు పాఠశాలల్లో కానరాని కొవిడ్‌ నిబంధనలు 

భౌతికదూరం, థర్మల్‌ స్ర్కీనింగ్‌ మరిచిన వైనం 

పాఠశాలల ప్రాంగణాలు, వర్షపునీరు, చెత్తకుప్పలతో దర్శనం


బుడి బుడి అడుగులు బడివైపు పరిగెత్తాయి. ఇన్నాళ్లు ఆడిపాడిన బాలలు బరువెక్కిన బ్యాగులను భుజాలపై మోసుకుంటూ తరగతి గది కి చేరుకున్నారు. అప్పటికే వచ్చిన కొందరిని పలకరిస్తూ, రాని వారి గురించి ఆరా తీస్తూ అల్లరి చేశారు. చాలారోజుల తర్వాత కన్పించిన గురువులకు నమస్కరించి, విద్యాభ్యాసం ప్రారంభించారు. అయితే జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభమైన తొలిరోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగానే ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులు 22.39 శాతం మాత్రమే హాజరుకాగా, ప్రైవేట్‌ పాఠశాలలకు 16.02 శాతమే హాజరయ్యారు. అయితే తొలిరోజు విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. వర్షాకాలం కావడంతో బురదమయ మైన పాఠశాల ప్రాంగణాలు, చెత్తాచెదారంతో దర్శనమిచ్చాయి.  


నల్లగొండ క్రైం, సెప్టెంబరు 1: కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సుమా రు 18 నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు ఎట్టకేలకు తెరుచుకున్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో బుధవారం జిల్లావ్యాప్తంగా గురుకులాలు, వసతి గృహాలు మినహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రభు త్వం 10 రోజులుగా ఆదేశాలు జారీచేస్తున్నా పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికభాగం పాఠశాలను నా మమాత్రంగా శుభ్రం చేయగా, చెత్తకుప్పలు, చెత్తాచెదారంతో పాఠశాలల ప్రాంగణాలు దర్శనమిచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని పాఠశాలల్లో నీరు నిలిచి ఇబ్బందికరంగా మారాయి. రెండురోజుల ముందుగానే పాఠశాలలను సిద్ధం చేయాలని అధికారులు సూచించినా, యాజమాన్యాల నిర్లక్ష్యంతో బుధవారంసైతం పరిశుభ్రత పనులు చేస్తూ కనిపించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,899 పాఠశాలలు ఉండగా అందులో 1,528 ప్రభుత్వ పాఠశాలలు, 371 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 3లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అయితే తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 22.39 శాతం విద్యార్థులు హాజరుకాగా ప్రైవేటు పాఠశాలల్లో 16.02 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30.42శాతం, ప్రైవేటులో 12.09శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కలిపి 33శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్‌, డిగ్రీ తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఇంటర్మీడియట్‌లో 12 ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 4,931 మందికి గానూ 595 మంది హాజరుకాగా 13.05శాతం, ద్వితీయ సంవత్సరం 3850 మందికి గానూ 505 మంది 13.01శాతం మంది హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన విద్యాసంస్థలను నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి సందర్శించారు.  


పూర్తిస్థాయిలో అందని పాఠ్యపుస్తకాలు

విద్యాసంవత్సరం ప్రారంభమై సుమారు మూడు నెలలు గడుస్తున్నా కానీ ఆయా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులకు బోధిస్తున్న పాఠశాలలు పుస్తకాలను అందించడంలో నిర్లక్ష్యం వహించాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం వరకు మాత్రమే పుస్తకాలు విద్యార్థులకు చేరినట్లు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.  


కొన్నిచోట్ల మరిచిన భౌతిక దూరం

కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటిస్తూ విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం, అధికారులు ఆదేశించినా ఆయా విద్యాసంస్థలు మాత్రం ఆ నిబంధనలు పాటించినట్లు ఎక్కడా కనిపించలేదు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌చేసి పాఠశాలల్లోకి అనుమతించాల్సి ఉండగా, ఎక్కడ కూడా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన దాఖలాలు కనిపించలేదు. కొన్ని పాఠశాలల్లో భౌతికదూరం కూడా మరిచి బెంచీ వెనుక బెంచీ ఏర్పాటుచేసి ఒక్కో బెంచీపై ఇద్దరు విద్యార్థుల చొప్పున కూర్చోబెట్టి బోధన ప్రారంభించారు. కొన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ను కూడా నామమాత్రంగా చేశారు. పాఠశాలల్లో ప్రవేశద్వారం వద్ద మాత్రమే శానిటైజర్‌ను అందుబాటులో ఉంచగా, తరగతి గదుల్లో మాత్రం ఎక్కడ కూడా అందుబాటులో ఉంచలేదు. మాస్కుల వినియోగంపై కూడా పెద్దగా దృష్టిసారించలేదు. 


సమస్యల స్వాగతం

సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభమైన విద్యాసంస్థలు విద్యార్థుల కు సమస్యలతో స్వాగతం పలికాయి. 18 నెలలుగా ఎలాంటి నిర్వహణ లేకుండా ఖాళీగా ఉన్న పాఠశాలలను పరిశుభ్రంచేసి విద్యార్థులకు అం దించడంలో కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం వహించాయి. జిల్లాకేంద్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు మండలాల పరిధిలోని పాఠశాలలు కూడా పాఠశాల మైదానాల్లో ఉన్న చెత్తా, ముళ్లకంపను తొలగించడంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో చెత్త చెదారంలోనే కొంత మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలకు వెళ్లే దారితోపాటు పాఠశాల ముందు భాగాల్లో మాత్రమే శుభ్రం చేశారు తప్ప పూర్తిగా చెత్తాచెదారాన్ని తొలగించలేదు. పాఠశాలల ప్రారంభానికి ముందే శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించినా, కొన్ని పాఠశాలల్లో బుధవారం కూడా శానిటైజేషన్‌ చేయడం గమనార్హం. 

Updated Date - 2021-09-02T07:04:19+05:30 IST