అమరవరం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-25T06:09:10+05:30 IST

మండలంలోని అమవరవంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది.

అమరవరం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
అమరవరం సబ్‌స్టేషన్‌లో ఎగిసిపడుతున్న మంటలు

 పేలిన 8వేల మెగావాట్ల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ 

ఐదు గంటల పాటు నిలిచిన విద్యుత్‌ సరఫరా 

 ప్రమాదంలో రూ.70 లక్షల ఆస్తి నష్టం

హుజూర్‌నగర్‌, ఆగస్టు 24: మండలంలోని అమవరవంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్‌స్టేషన్‌లోని సీటీ(కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌) ఓవర్‌లోడ్‌తో పేలి జంపర్లపై పడటంతో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలింది. అదే సమయంలో ఎలక్ర్టికల్‌ ఓవర్‌ హీట్‌తో 6వ ఫేజ్‌ జంపర్‌ తెగి రేడియేటర్‌పై పడింది. దీంతో ఆయిల్‌ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈసమయంలో ఎల్‌బీ-1 రిలే, ఎల్‌బీ-2 బ్రేకర్‌తోపాటు త్రీనెంబర్స్‌ సీటీఎస్‌ కంట్రోల్‌ కేబుల్స్‌, పీటీఆర్‌-2 మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ.70 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. 


ఉలిక్కి పడ్డ సిబ్బంది

సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేడంతో ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే తేరుకున్న సిబ్బంది ఘటనా సమాచారాన్ని హుజూర్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌కు చేరవేయగా, సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు.  


నాలుగు గ్రామాలు.. ఐదు గంటలు

అమరవరం సబ్‌స్టేషన్‌లో ప్రమాదంతో యాతవాకిళ్ళ, మగ్దుమ్‌నగర్‌, శ్రీనివాసపురం, లింగగిరి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రతిరోజూ ఈ గ్రామాలకు సబ్‌స్టేషన్‌ నుంచి 200మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదం చోటు చేసుకోగా, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. సబ్‌స్టేషన్‌లోని మరో ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను ప్రారంభించారు. అప్పటి వరకు సుమారు ఐదు గంటలపాటు నాలుగు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచింది. వ్యవసాయ పనులు ప్రారంభంకావడంతో అమరవరం ప్రాంతంలో సబ్‌స్టేషన్‌కింద రైతులు పెద్దఎత్తున బోర్లు, బావుల కింద మోటార్లతో సేద్యం చేస్తున్నారు. దీంతో ఓవర్‌ లోడ్‌ పడడంతో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మఠంపల్లి 132 కేవీ నుంచి అమరవరం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది

నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం : అధికారులు

అమరవరం సబ్‌స్టేషన్‌లో ప్రమాద ఘటనపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎస్‌ఈ సతీ్‌షబాబు, డీఈ అమరబోయిన శ్రీనివాస్‌, ఏడీఈ సక్రూనాయక్‌ సాయంత్రం సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ప్రమాద వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అధికారులతో పాటు జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా 8వేల మెగావాట్ల విద్యుత్‌ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినట్లు సబ్‌ ఇంజనీర్‌ పరశురాములు తెలిపారు.  

Updated Date - 2021-08-25T06:09:10+05:30 IST