రైతు వర్రీ

ABN , First Publish Date - 2021-10-29T05:54:09+05:30 IST

వానాకాలం వరి దిగుబడులు రైతుల చేతికి రావడం ప్రారంభమైంది.

రైతు వర్రీ
నల్లగొండ జిల్లా వేములపల్లిలో రోడ్డు పక్కన బారులు తీరిన ధాన్యం లోడు ట్రాక్టర్లు

 మిల్లుల ఎదుట ధాన్యం ట్రాక్టర్ల బారులు

 దక్కని మద్దతు ధర

 యాసంగిలో వరి సాగుపై రాజకీయ రగడ

 ఆందోళనలో అన్నదాతలు

వానాకాలం వరి దిగుబడులు రైతుల చేతికి రావడం ప్రారంభమైంది. దీపావళి తరువాత కోతలు మరింత ముమ్మరం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నూర్పిడి చేసిన రైతులు మిల్లులకు క్యూకడుతున్నారు. ఏటా ధాన్యం విక్రయాల సమయంలో మిల్లుల వద్ద రైతులకు జాగారం తప్పడం లేదు. ప్రస్తుత సీజన్‌లో సైతం అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ధాన్యం విక్రయించేందుకు మిల్లుల వద్ద రెండు, మూడు రోజులపాటు రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఇక రైతుల అవసరాన్ని గమనించిన మిల్లర్లు మద్దతు ధర ఎగ్గొడుతున్నారు. ఇదిలా ఉండగా, యాసంగిలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం స్పష్టంచేస్తుండగా, ఈ అంశంపై రాజకీయ రగడ మొదలైంది. అయితే యాసంగిలో ఏ పంట సాగుచేయాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

మిర్యాలగూడ, నేరేడుచర్ల

రైతులు హార్వెస్టర్లతో ధాన్యం కోసిన వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం ఆరబోసి తీసుకెళ్లేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. మిల్లుల వద్ద ట్రాక్టర్లు బారులుతీరి ఉంటున్నాయి. అదేవిధంగా రోజురోజుకూ ధర పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో చేతికొచ్చిన పంట కోయాలా వద్దా? అలాగే ఉంచితే పంట నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులు, లారీ యజమానులు సిండికేట్‌గా మారి ధరలు నిర్ణయిస్తున్నారు. వ్యాపారులు కమీషన్‌ పెంచుకోగా, లారీ యజమానులు డీజిల్‌ ధరల పేరుతో కిరాయి పెంచేశారు. ధాన్యం ఎక్కువగా వస్తుండటంతో కొనలేమనే సాకుతో మిల్లర్లు ముందుగానే ధర తగ్గిస్తున్నారు. దీంతో అన్ని విధాలా రైతులు నష్టపోతున్నారు. ఇక మిర్యాలగూడకు ధాన్యం తీసుకురావద్దంటూ సూర్యాపేట జిల్లా రైతులకు అక్కడి పోలీసులు అల్టిమేటం ఇచ్చారు.


మిల్లుల వద్ద బారులు

మిర్యాలగూడ ప్రాంతంలో కేవలం 16 రైస్‌మిల్లుల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఈ మిల్లుల వద్ద బారులుతీరి రోజుల తరబడి వేచిచూస్తున్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం ధాన్యం ట్రాక్టర్లతో రైస్‌మిల్లుల వద్దకు చేరుకోగా, గురువారం మధ్యాహ్నం 12గంటల వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని అన్నపురెడ్డి గూడెం స్టేజీ వద్ద, సాగర్‌రోడ్డులోని ఎఫ్‌సీఐ వద్ద ఉన్న మిల్లు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తేమ ఎక్కువగా  ఉందన్న కారణంతో తక్కువ ధరకు తీసుకుంటామని లక్ష్మిగణపతి మిల్లు యజమానులు చెప్పడంతో రైతులు వాదనకు దిగారు. మిర్యాలగూడ రైస్‌ ఇండస్ట్రీ మిల్లు వద్ద సాగర్‌ రోడ్డుపై రైతులు అరగంటపాటు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసు, వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని మిల్లు గేట్లను తెరిపించడంతో రైతులు ఆందోళన విరమించారు. అవసరాన్ని ఆసరాగా తీసుకుని మిల్లర్లు క్వింటా ధాన్యాన్ని రూ.1700కు మించి చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసు అధికారుల సమక్షంలో రూ.1800 చెల్లిస్తున్న రైతులు, వారు వెళ్లిన మరుక్షణమే ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వేములపల్లి మండల కేంద్రంలో దిగుమతి మిల్‌ పాయింట్ల వద్ద భారీగా ధాన్యం లోడు ట్రాక్టర్లు బారులు తీరాయి. దీంతో రూరల్‌ సీఐ ఆధ్వర్యంలో వాడపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, మాడ్గులపల్లి మండలాల ఎస్‌ఐలు విడతల వారీగా సమీపంలోని మిల్లుల వద్దకు ట్రాక్టర్లు చేరేలా క్రమబద్ధీకరించారు.


రెండు రోజులు వరి కోతలకు విరామం

నల్లగొండ టౌన్‌: వానాకాలం ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బంది ఎదుర్కోకుండా శుక్ర, ఆదివారం రెండు రోజులపాటు వరి కోతలకు అధికారులు విరామాన్ని ప్రకటించారు. దీన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు హార్వెస్టర్‌ యజమానులు నిర్ణయించారు. నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌, జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌, పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ, హార్వెస్టర్‌ యజమానులు, మిల్లర్లతో గురువారం సమావేశం నిర్వహించి వానాకాలం ధాన్యం సేకరణలో ఇబ్బందులపై చర్చించారు. ఒకేసారి హార్వెస్టర్‌ యంత్రాలతో వరి కోతలు కోస్తుండటంతో మిల్లులకు భారీగా ధాన్యం వస్తోందని, దీంతో రద్దీ ఏర్పడి ఇబ్బందులు ఎదురవున్నాయని అధికారులు గుర్తించారు. దీంతో ఈనెల 29, 31న రెండు రోజులు వరి కోతలకు విరామం ప్రకటించారు. ప్రతి వారం రెండు రోజులు వరి కోతలకు విరామం ఉండనుంది. నవంబరు 1వ తేదీన తిరిగి సమావేశం నిర్వహించి గురు, ఆదివారం రెండు రోజులు విరామం ఇచ్చేందుకు నిర్ణయించారు. వరి కోతల సమయంలో హార్వెస్టర్ల యజమానులు బ్లోయర్లు వినియోగించాలని అధికారులు సూచించారు. సరైన ధర చెల్లించడం లేదని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌ అధికారుల దృష్టికి తీసుకురాగా నాణ్యత ప్రమాణాల మేరకు సరైన ధర చెల్లించాలని మిల్లర్లను ఆదేశించారు. సమావేశంలో డీఎ్‌సవో వెంకటేశ్వర్లు, మార్కెటింగ్‌ డీఎం నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ ఏడీ హుస్సేన్‌బాబు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధికారుల నిర్ణయం మేరకు వరి కోతలకు రెండు రోజుల హాలిడేను రైతులు, హార్వెస్టర్‌ యజమానులు పాటించాలని ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల ఎస్‌ఐలు ప్రకటించారు.


వరి వద్దనడం విడ్డూరం

మిర్యాలగూడ: యాసంగిలో వరిపంట సాగుచేయొద్దని ప్రభుత్వం రైతులను ఇరకాటంలో పెట్టడం విడ్డూరంగా ఉందని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు చలమల సీతారాంరెడ్డి అన్నారు. వరి సాగు చేయవద్దని మంత్రులు ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు వేములపల్లి మండలంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను గురువారం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతారాంరెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వం వరిసాగును వద్దనడం భావ్యంకాదన్నారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలవుతుండటంతో భూములు జాలువారి మెట్టపంటల సాగుకు అనుకూలించవన్నారు. విద్యుత్‌ సరఫరా, సాగునీటి విడుదల భారాన్ని తగ్గించుకునే దురుద్దేశంతోనే ప్రభుత్వం వరిసాగును నియంత్రించేందుకు సిద్ధపడిందన్నారు. మరోవైపు వానాకాలం ధాన్యం వస్తుండగా, కొనుగోలుకు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతుల కష్టాన్ని మిల్లర్లకు దోచిపెట్టే ధోరణితో ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.  వరి వద్దంటూ ప్రకటనలతో ఊదరకొడుతున్న మంత్రులు ప్రస్తుత ధాన్యం దిగుమతుల విషయంలో స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి, ప్రధానకార్యదర్శి పుట్టల సందీప్‌, పేరమోయిన సైదులు, ఉపేందర్‌, వెంకట్‌రెడ్డి, మట్టయ్య, సతీష్‌ పాల్గొన్నారు. 


విత్తన డీలర్లు డీలా

తుర్కపల్లి: విత్తన విక్రయాలపై ఆంక్షలతో డీలర్లు డీలాపడ్డారు. యాసంగి సాగుకు సంబంధించి వరి విత్తనాలను విక్రయించవద్దని యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో డీలర్లను హెచ్చరించారు. అంతేగాక వరి విత్తనాలు విక్రయించడం లేదని దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇప్పటికే వరి విత్తనాలు స్టాక్‌ ఉంటే వాటిని తిరిగిచ్చేయాలని ఆదేశించారు. కాగా, విత్తనాలు విక్రయించవద్దని అధికారుల హెచ్చరికలతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు వద్దని ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ఆరుతడి పంటల్లో కందులు, వేరుశనగ, మినుములు తదితర విత్తనాలు సహకార సంఘాల్లో రైతులకు సబ్సిడీపై ఇస్తున్నారు. అంతేగాక ఆరుతడి పంటకు ఎరువులు అంతగా అవసరం ఉండదు. దీంతో దుకాణాలు మూసుకోవాల్సిందేనని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల నుంచి మిల్లు వద్దే: గుత్తా శ్రీనివాసరెడ్డి, రైతు, సల్కునూరు, వేములపల్లి 

సల్కునూరు నుంచి మూడు ట్రాక్టర్‌ల ధాన్యంతో రెండు రోజుల క్రితం మిల్లువద్దకు వచ్చా. బుధవారం రాత్రి కొనుగోలు చేస్తామని చెప్పిన మిల్లర్‌, గురువారం 12 గంటల వరకు కూడా తెరవలేదు. గట్టిగా అడిగితే తక్కువ ధరకు విక్రయించమంటున్నారు. లేదంటే కొనుగోలు చేసేదిలేదని మొండికేస్తున్నారు. ధర పెంచమని బతిమాలినా వినలేదు. చివరికి రూ.1740కే ధాన్యం విక్రయించా.

Updated Date - 2021-10-29T05:54:09+05:30 IST