కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం

ABN , First Publish Date - 2021-05-02T05:40:23+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తుండగా, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబసభ్యులు అనాథలుగా మిగులుతున్నారు. తల్లి, తండ్రి, భర్త, భార్యను కోల్పోయిన కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌తో మృతిచెందిన వారు కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోవడం లేదు.

కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం
నల్లగొండలో మహిళ అంత్యక్రియలు చేయిస్తున్న పున్న కైలాష్‌నేత

ఇంటి పెద్దదిక్కును కోల్పోతున్న కుటుంబసభ్యులు

దూరమవుతున్న బంధుత్వాలు

ఉమ్మడి జిల్లాలో 12మంది మృతి


నల్లగొండ : కరోనా రెండో దశ విజృంభిస్తుండగా, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబసభ్యులు అనాథలుగా మిగులుతున్నారు. తల్లి, తండ్రి, భర్త, భార్యను కోల్పోయిన కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌తో మృతిచెందిన వారు కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోవడం లేదు. కరోనాతో బంధుత్వాలు కూడా దూరమవుతున్నాయి. పాజిటివ్‌తో మృతిచెందిన విషయం తెలిసినా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులెవ్వరూ సాహసించడం లేదు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు సైతం ముందుకురావడం లేదు. పాజిటివ్‌తో మృతిచెందిన వారు అందరూ ఉన్నా చివరికి ఎవ్వరూ లేని అనాథలుగా అంత్యక్రియలకు కూడా నోచుకోవడం లేదు. మానవత్వంతో ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలను పూర్తిచేసి మనసుచాటుకుంటున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్కరోజే 12మంది మృతిచెందారు. మొత్తం 1,254 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండాకు చెందిన మహిళ(55)కు పాజిటివ్‌ రాగా, గతనెల 30న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవే ట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శని వారం ఉదయం మృతి చెందింది. కాగా, గత నెల 27న ఆమె కుమారుడు సైతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ పాజిటివ్‌తో మృతిచెందాడు. ఇతడి భార్య సైతం పాజిటివ్‌తో ప్రస్తుతం మిర్యాలగూడలో చికిత్స పొందుతోంది. కాగా, యువకుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్‌ వి.బాల్‌సింగ్‌నాయక్‌ హైదరాబాద్‌ వెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అతడి తల్లి అంత్యక్రియలను సైతం సర్పంచ్‌ హైదరాబాద్‌ వెళ్లి అక్కడే నిర్వహించి మానవత్వం చాటారు.

ఏపీ రాష్ట్రం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా నల్లగొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబ యజమానురాలు కరోనాతో శనివారం మృతిచెందగా, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని ఆమె కుమారుడి స్నేహితుల ద్వారా తెలుసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత తన సొంత ఖర్చులతో ఆమె అంతిమసంస్కరాలు పూర్తిచేయించారు. 

పెద్దఅడిశర్లపల్లి మండలకేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు(41) కొంత కాలంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేస్తుండగా, కరోనా బారినపడ్డాడు. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్‌ రాగా, హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అతడి పరిస్థితి విషమించడంతో గత నెల 25న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

పెద్దవూర మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు(36)కు వారం రోజుల క్రితం పాజిటి వ్‌ రాగా, నల్లగొండ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అతడి అంత్యక్రియలను నల్లగొండలోనే నిర్వహించారు. అదేవిధంగా జయరాంతండాకు చెందిన ఆటో డ్రైవర్‌ పాజిటివ్‌తో మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని తండాకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

హుజూర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఒకరు(40) కోదాడ డీఎస్పీ ఆఫీసులో బాధ్యతలు నిర్వహిస్తుండగా, గత నెల 28న పాజిటివ్‌ వచ్చింది. సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 

హుజూర్‌నగర్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నేత, కారు డ్రైవర్‌(26) కరోనాతో శనివారం మృతి చెందాడు. పదిరోజుల క్రితం పాజిటివ్‌ రాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

మునగాల మండల కేంద్రానికి (68) ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గత నెల 23న ఆమె భర్త కూడా కరోనా పాజిటివ్‌తో మృతిచెందాడు. అతడి మృతి అనంతరం ఐదు రోజులకే ఈమెకు పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల వ్యవధిలో దంపతులు ఇద్దరు కన్నుమూశారు. ఆమె చిన్నకుమారుడు గతంలో విద్యుదాఘాతంతో మృతిచెందగా, పెద్ద కుమారుడే ఇంతకాలం వీరి ఆలనాపాలనా చూశాడు.

నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన వృద్దురాలు(75) సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందగా, అక్కడే ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు.

జిల్లాలోని చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి(60)కి రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. 

బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు(70) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందాడు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) పోలీ్‌సస్టేషన్‌కు చెందిన ఏఎ్‌సఐ(57) కొంతకాలంగా డిప్యూటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తున్నాడు. ఆయనకు పది రోజుల కిందట కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అప్పటి నుంచి వారం రోజులు హోంఐసోలేషన్‌లో ఉన్నాడు. మూడు రోజుల కిందట శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చందనపల్లి కాగా, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

Updated Date - 2021-05-02T05:40:23+05:30 IST