అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించొద్దు

ABN , First Publish Date - 2021-12-28T05:40:59+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించొద్దని అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు పిట్ట పిచ్చయ్య డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించొద్దు
గరిడేపల్లిలో రాస్తారోకో చేస్తున్న అంబేడ్కర్‌ యువజన సంఘ నాయకులు

గరిడేపల్లి, డిసెంబరు 27 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించొద్దని అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు పిట్ట పిచ్చయ్య డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో గరిడేపల్లిలోని ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన బండా పుల్లారెడ్డి నేషనల్‌ హైవేపై అంబేడ్కర్‌ విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు చేపట్టవద్దని హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారన్నారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని 25 ఏళ్ల క్రితం గరిడేపల్లి-కల్మల్‌చెర్వు క్రాస్‌రోడ్డులో ఆర్‌అండ్‌బీ పరిధిలోనే నెలకొల్పారని; రోడ్డు విస్తరణలో తొలగించగా పునఃప్రతిష్ఠకు పనులు పూర్తి చేశామన్నారు. విగ్రహ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరం లేదని పుల్లారెడ్డి స్వప్రయోజనాల కోసం సమస్యలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్న పుల్లారెడ్డి అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు నన్నుపంగు సైదులు, మంద భిక్షం, కొత్తపల్లి రవి, మైసయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, సైదులు, నర్సయ్య, బరిగెల విజయ్‌కుమార్‌, సైదులు, హుస్సేన్‌, వెంకన్న, చంటి, అమరవరం సతీష్‌, సాయి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-28T05:40:59+05:30 IST