పల్లె ప్రజలకు దూరమైన వైద్యం
ABN , First Publish Date - 2021-05-09T04:28:07+05:30 IST
నూతనంగా ఏర్పాటైన పాలకవీడు మండలంలోని పల్లె ప్రజలకు వైద్యం దూరమైంది.

పాలకవీడు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై నిర్లక్ష్యం
మండలంలో కరోనా బీభత్సం
టెస్టులకు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే
ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎంపీడీవో ఆఫీస్‌గా మార్చిన వైనం
పాలకవీడు, మే 8 : నూతనంగా ఏర్పాటైన పాలకవీడు మండలంలోని పల్లె ప్రజలకు వైద్యం దూరమైంది. కరోనా కష్ట కాలంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కరోనా నిర్ధారణ టెస్టులు, టీకాల కోసం 30 కిలోమీటర్ల దూరంలోని నేరేడుచర్లకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటుతున్నా పాలకవీడులో పూర్తిస్ధాయి వైద్యాధికారులు, నర్సులు లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలు వాటి ఆవాస గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులు, కరోనా చికత్సల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. ఎంపీడీవో ఆఫీస్‌కు భవనం లేకపోవడంతో పాలకవీడు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎంపీడీవో ఆఫీస్‌గా వినియోగిస్తున్నారు. అందులో చిన్న గదిని మాత్రం ఉప కేంద్రానికి కేటాయించారు. మండలంలోని కల్మెట్‌తండలోనూ ఆరోగ్య ఉపకేంద్రం ఉంది. అది ఇప్పుడు పశువుల నిలయంగా మారింది.
మండలంలో అధిక శాతం గిరిజనులు ఉన్నారు. గిరిజనులు, ఇతరులు సరైన వైద్యం చేయించుకోవాలంటే సమీపంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు కానీ లేదా నేరేడుచర్లకు కాని వెళ్లాల్సి వస్తోంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ కూలి దొరకడమే కష్టంగా ఉంది. పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేల రూపాయలు వెచ్చించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలకవీడు మండల ప్రజలకు ఏదైనా రోగం వస్తే సమీపంలోని నేరేడుచర్ల, పెంచికల్ దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కుగా మారాయి. పూర్థిస్థాయిలో ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిని నియమించి సేవలు అందేలా చూడా లని స్థానికులు కోరుతున్నారు.