కరోనాతో 15 మంది మృతి
ABN , First Publish Date - 2021-05-21T06:08:57+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 1,105 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

1105 పాజిటివ్ కేసులు నమోదు
బ్లాక్ ఫంగస్ బారిన మరో వ్యక్తి
నల్లగొండ, మే 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 1,105 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ 15 మంది మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో 432, సూర్యాపేట 256, యాదాద్రి భువనగిరి జిల్లాలో 417మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 98,188మంది కరోనా బారిన పడగా; 482మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. 64,543 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి కాగా, 33,163 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది హోంఐసొలేషన్‌లో ఉన్నారు.
కుమార్తె పెళ్లి వాయిదా.. తండ్రి మృతి
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామనగుండ్ల వీఆర్‌ఏ బండారు దుర్గయ్య(52) పెద్ద కుమార్తెకు ఈ నెల 14వ తేదీన వివాహం నిశ్చయించారు. 13వ తేదీన దుర్గయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండ తరలించారు. దీంతో కుమార్తె వివాహం వాయిదా పడింది. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బుధవారం నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సూర్యాపేట జిల్లా వాసికి బ్లాక్ ఫంగస్
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్లకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడికి బ్లాక్‌ఫంగస్ వైర్‌సగా వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేత నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నాడు. వారం రోజులుగా తీవ్రమైన తలనొప్పి, మూర్చ రావడంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. తలనొప్పి, చెవి నొప్పి తీవ్రంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేసి బ్లాక్ ఫంగస్ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా చికిత్స సమయంలో ఐదు రెమిడెసివిర్ ఇంజక్షన్లు చేయించామన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు..
కరోనా మహమ్మారి వారం వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలితీసుకుంది. నల్లగొండ జిల్లాకేంద్రానికి చెందిన బండమీది యాదయ్య (52) అన్నెపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన యాదయ్య కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఈ నెల 4వ తేదీన యాదయ్య తండ్రి పాపయ్య(70), తల్లి, భార్య ఉప్పలమ్మ(46), ఇద్దరు కుమారులు, కుమార్తె మొత్తం ఆరుగురు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పెద్ద కుమారుడు రెండు డోసుల టీకా తీసుకోవడంతో మిగిలిన ఐదుగురికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాపయ్యను నల్లగొండ జిల్లా కేంద్రాసుపత్రిలో చేర్పించగా; ఈ నెల 15వ తేదీన మృతి చెందాడు. అయితే హోంఐసోలేషన్‌లో ఉన్న యాదయ్య, అతని భార్య ఉప్పలమ్మను హైదరాబాద్ తరలిస్తుండగా, యాదయ్య మార్గమధ్యంలో మృతి చెందగా, ఉప్పలమ్మ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
. పెద్దఅడిశర్లపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు(48) కరోనాతో మృతిచెందాడు. మండలకేంద్రంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. మెరుగైన వైద్యానికి హైదరాబాద్ తరలించగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు.
. శాలిగౌరారం మండలంలోని గురజాల గ్రామానికి చెందిన ఆలకుంట్ల రాములు (60) కరోనాతో హైదరాబాదులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి అంత్యక్రియలను గ్రామ సర్పంచ్ గుండా శ్రీనివాస్ దగ్గరుండి జరిపించారు. అదే విధంగా మండలంలోని వంగమర్తి గ్రామానికి చెందిన మామిడోజు కళమ్మ(65) కరోనాతో బాధపడుతూ సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినది.
. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మధుసూదన్ కరోనాతో మృతిచెందినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మృతుడిది వరంగల్ రూరల్ జిల్లా, వర్దనపేట గ్రామం. కాగా మధుసూదన్ మృతిపట్ల మార్కెట్ చైర్మన్ మూల అశోక్‌రెడ్డి సంతాపం తెలిపారు.
. కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో వృద్ధురాలు (67) కరోనాతో మృతి చెందింది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమె భర్త రాయన్న గుండెపోటుతో ఇటీవల మృతి చెందగా, కరోనాబారిన పడిన కుమారుడు ప్రస్తుతం సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
. మాడ్గులపల్లి మండలం తోపుచర్ల, ఇందుగుల గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు.
. మునుగోడు మండలం పలివెలకు చెందిన ఆటో డ్రైవర్(40) కరోనాతో హైదరాబాద్‌లో మృతిచెందాడు.
. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన అయిటిపాముల లక్ష్మయ్య గురువారం కరోనాతో చికిత్స పొందుతూ నల్లగొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు.అంత్యక్రియల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో కరోనాతో ఓ మహిళ మృతిచెందింది.
. అర్వపల్లి మండలకేంద్రానికి చెందిన మహిళ(40) కరోనాతో గురువారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
. యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ప్రశాంత్ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ ఆయా వన్నాల మహేశ్వరి(45) కరోనా పాజిటివ్‌తో గురువారం మృతిచెందింది.