ధరణి పోర్టల్.. లోపాల పుట్ట
ABN , First Publish Date - 2021-12-26T05:44:48+05:30 IST
ఎలాంటి భూవివాదాలకు తావు లేకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కొత్త వివాదాలకు దారి తీస్తోంది. రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ భూములు కొని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ధరణిలోని సాంకేతిక లోపాల కారణంగా ఇప్పటికీ మ్యుటేషన్ కాలేదు.

రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయినా మారని పట్టా
ఒకే భూమిని ఇద్దరికి అమ్మేయత్నం
మ్యుటేషన్కాక పెండింగ్‌లో ఉన్న భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు
లబోదిబోమంటున్న కొనుగోలుదారులు
మోత్కూరులో వెలుగులోకి వచ్చిన ఘటన
మోత్కూరు, డిసెంబరు 25: ఎలాంటి భూవివాదాలకు తావు లేకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కొత్త వివాదాలకు దారి తీస్తోంది. రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ భూములు కొని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ధరణిలోని సాంకేతిక లోపాల కారణంగా ఇప్పటికీ మ్యుటేషన్ కాలేదు. పట్టా మార్పిడి జరగలేదు. ధరణిలో పాత యజమానుల పేర్లే కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా భావించి వారు గతంలో అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన భూములనే తిరిగి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పటికే నాలుగైదు వెలుగులోకి రాగా తాజాగా ఓ యజమాని భూమిని ఒకరికి అమ్మి రిజిస్ట్రేషన్ చేసి, వారికి మ్యుటేషన్ కాకపోవడంతో మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నిచాడు. ఈ ఘటన మోత్కూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆర్బీఎస్ డెయిరీ అండ్ అగ్రిఫామ్స్ ఎండీ సోలిపురం శ్రీనివా్‌సరెడ్డికి మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలో సర్వేనంబర్లు 157/లూ2/2, 157ఆ2/2, 157క/1 లో 10 ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఆయన 2019 డిసెంబరు 30న హైదరాబాదుకు చెందిన ఏనుగు కొండల్‌రెడ్డి, దుడ్యాల రవీందర్, అశోక్‌రెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్చేశారు. కొండల్‌రెడ్డి తదితరులు భూమిని మ్యుటేషన్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకోగా ఆ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజక్ట్ అయి మ్యుటేషన్ కాలేదు. వారి పేరున పట్టా మార్పిడి జరగలేదు. దాంతో ధరణి పోర్టల్‌లో ఆర్బీఎస్ డెయిరీ యజమాని శ్రీనివా్‌సరెడ్డి పేరే వస్తోంది. ఇదే అదునుగా ఆర్బీఎస్ డెయిరీ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి, అదే భూమిని వేరొకరికి అమ్మినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులు ఇటీవల ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీంతో గత బుధవారం శ్రీనివా్‌సరెడ్డి ఆ భూమిని మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుక్‌చేశాడు. అనుకోకుండా పాత కొనుగోలుదారులు కొండల్‌రెడ్డి తదితరులు ధరణి పోర్టల్‌లో ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారో లేదో చూద్దామని పోర్టల్‌ను పరిశీలించగా ఆ భూమి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ ఆయినట్లు తెలుసుకున్నారు. వారు లబోదిబోమంటూ వెంటనే ఆ భూమి తమకు అమ్మి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశాడని విషయాన్ని భువనగిరి ఆర్డీవో, మోత్కూరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.
సబ్ రిజిస్ట్రార్ శాఖ డేటాతో ధరణికి కుదరని లంకె
ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందు వ్యవసాయ భూములు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ శాఖలో పేరుకపోయిన అవినీతి, నిర్లక్ష్యం కారణంగా మ్యుటేషన్ కాక పెండింగ్‌లో ఉన్నాయి. కొనుగోలుదారుల చేతుల్లో రిజిస్ట్రేషన్లు ఉన్నా, రెవెన్యూ రికార్డుల్లో పాత యజమానుల పేర్లే ఉంటున్నాయి. దీంతో పాత యజమానులు అమ్మిన భూములనే తిరిగి అమ్మి రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో డబుల్ రిజిస్ట్రేషన్లు అయి కోర్టులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
డిప్యూటీ తహసీల్దార్ వివరణ
మోత్కూరు మండలం ముశిపట్లలో గతంలో అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన భూమినే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ అయిన విషయంపై మోత్కూరు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్‌రావును వివరణ కోరగా అది వాస్తమేనన్నారు. ఆ భూమి గతంలో రిజిస్ట్రేషన్ అయినందున రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేశామన్నారు.
సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్లను ధరణితో అనుసంధానం చేయాలి : నర్సింహారెడ్డి, ధరణి భూసమస్యల వేదిక కన్వీనర్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకు న్న కొనుగోలుదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో (ధరణి పోర్టల్‌లో) నమోదు కాలేదు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి వెంటనే మ్యుటేషన్ చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులోని రిజిస్ట్రేషన్ల వివరాల కు, రెవెన్యూ వివరాలకు ఒకదానికొకటి సంబంధం లేకుం డా పోయాయి. దీంతో రాష్ట్రంలో అనేక చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అప్పుడు తామేమి చేయలేమని అధికారులు చెతులెత్తేస్తుండటంతో బాధితులు కోర్టు మెట్లెక్కి, ఆర్ధికంగా చితికి పోతున్నారు. సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోని సేల్ డీడ్స్, ఈసీలను ధరణితో అనుసంధానం చేయాలి.